
శుక్రవారం వచ్చిదంటే చాలు బాక్సాఫీస్ ముందు తమ భవిష్యత్‌ను పరీక్షించుకోడానికి సినిమాలు అలా వచ్చి పడుతుంటాయి. అయితే ఈ వారం ఒక్క తెలుగు సినిమా కూడా విడుదలయ్యే సూచనలు లేకపోవడం గమనార్హం. దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ గత శుక్రవారం విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ,మళయాల, హిందీ ఇలా ఎల్లలనేది లేకుండా, బాహుబలి సినిమా విడుదలైన అన్ని చోట్లా అద్భుతమైన కలెక్షన్లను కొల్లగొడుతూ తెలుగు సినిమా సత్తా చాటుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి’ ఈ స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతున్న తరుణంలో వస్తే తమ సినిమాకు కనీస గుర్తింపు కూడా ఉండదన్న ఆలోచనలో వేరే ఏ ఇతర తెలుగు సినిమా ఈ శుక్రవారం విడుదలకు సాహసించలేదు. మొదట్లో అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘జేమ్స్‌బాండ్’, మంచు విష్ణు ‘డైనమైట్’తో పాటు మరికొన్ని సినిమాలు జూలై 17నే విడుదలయ్యే సూచనలు కనిపించినా, ‘బాహుబలి’కి వచ్చిన రెస్పాన్స్‌తో ఆ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఇక దీంతో మరో వారం రోజుల పాటు థియేటర్లలో ‘బాహుబలి’ సినిమా మాత్రమే హంగామా చేయనుందనేది సుస్పష్టం.
ఇదిలా ఉంటే.. తమిళ, హిందీల్లో మాత్రం బాహుబలికి పోటీగా ఈ శుక్రవారం రెండు భాషల్లోనూ పెద్ద సినిమాలు రానున్నాయి. ఈ ఏడాది రంజాన్ పండుగ సందర్భంగా బాలీవుడ్లో విడుదలవుతోన్న అతిపెద్ద సినిమా సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భైజాన్’. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలున్నాయి. ఇక తమిళంలో ధనుష్ హీరోగా నటించిన ‘మారీ’ కూడా భారీ అంచనాల మధ్యే విడుదల కానుంది. ఈ రెండు ప్రాంతాల్లో ‘బాహుబలి’ కలెక్షన్లకు కొంతమేర అడ్డంకి ఎదురుకానుంది.