‘శ్రీమంతుడు’లో స్టూడెంట్‌గా మహేష్..?

Mahesh-srimantudu
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టూడెంట్‌గా కనిపించి ఎన్నేళ్ళైంది? ఎప్పుడో ‘సైనికుడు’ సినిమాలో సిద్దార్థ అనే పీజీ స్టూడెంట్‌గా కనిపించి అభిమానుల్ని అలరించిన మహేష్, ఆ తర్వాత ఎక్కడా స్టూడెంట్ అవతారంలో కనిపించింది లేదు. మళ్ళీ ఇన్నేళ్ళకు ఇప్పుడు మహేష్ స్టూడెంట్ అవతారంలో కనిపించి అభిమానుల్ని అలరించనున్నట్లు సమాచారం. తన కొత్త సినిమా ‘శ్రీమంతుడు’లో మహేష్ స్టూడెంట్‌గా కొద్దిసేపు కనిపించనున్నట్లు తెలుస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా చేస్తోన్న ‘శ్రీమంతుడు’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగష్టు 7న భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ నెల 18న హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో జరగనుంది. ఇక ఆడియో రిలీజ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విడుదలైన పోస్టర్‌లలో మహేష్ పుస్తకాలు పట్టుకొని, శృతి హాసన్‌తో కలిసి స్టూడెంట్ అవతారంలో కనిపిస్తున్నాడు.

ఈ పోస్టర్లను చూసిన వారంతా కొరటాల శివ తన మొదటి సినిమా మిర్చిలో ప్రభాస్ కొద్దిసేపు స్టూడెంట్‌గా చూపించినట్టుగా ఈ సినిమాలో మహేష్‌నూ చూపించనున్నట్లు భావిస్తున్నారు. శ్రీమంతుడులో మహేష్ ఓ అత్యంత ధనిక కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా కనిపించనున్న విషయం తెలిసిందే! దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు కాగా, మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Exit mobile version