పైరసీ.. ప్రమాదకరమైన క్రిమినల్ చర్య : రాజమౌళి

rajmouli
తెలుగు, తమిళం, హిందీ, మళయాలం ఇలా ఏ సినీ పరిశ్రమైనా పైరసీ అనే భూతానికి ఎప్పట్నుంచో భయపడుతూనే ఉంది. ఎంత క్రేజ్ ఉన్న సినిమా అయినా, ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా, ఎలాంటి పరిస్థితుల్లో విడుదలైన సినిమా అయినా విడుదల రోజు సాయంత్రం కల్లా పైరసీ రూపంలో ఆన్‌లైన్లో ప్రత్యక్షమవుతోంది. వందల కోట్ల రూపాయల బిజినెస్‌ జరిగే ఈ పరిశ్రమలో పైరసీ భూతం ఎన్నో సినిమాలను నష్టాల్లోకి నెట్టేస్తోంది. దీనిపై ఇప్పటికే ఇటు పరిశ్రమ, అటు పోలీస్ యంత్రాంగం ఎన్ని చర్యలు చేపడుతున్నా సినిమా పైరసీ అనేది ఆగడం లేదు.

ఈ విషయంపైనే ప్రముఖ నేషనల్ న్యూస్ చానల్ సీఎన్‌ఎన్ ఐబీఎన్ ‘సే నో టూ పైరసీ’ పేరుతో ఓ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. పైరసీ జరగడానికి గల కారణాలు, దానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రేక్షకులు స్వచ్చందంగా పైరసీని తరిమేయడం లాంటి విషయాలను ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రచారంలోకి తెస్తున్నారు. ఇక ఈ క్యాంపెయిన్‌‌కు తనవంతుగా మద్ధతు తెలుపుతూ దర్శక ధీరుడు రాజమౌళి పైరసీపై ధ్వజమెత్తారు. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘బాహుబలి’ కూడా పైరసీ బారిన పడిన విషయం తెలిసిందే.

ఇదే విషయంపై రాజమౌళి సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌తో మాట్లాడుతూ.. “పైరసీ అనేది నా దృష్టిలో అత్యంత ప్రమాదకరమైన క్రిమినల్ చర్య. చెప్పాలంటే పైరసీ నియంత్రణకు మనం తయారుచేసుకున్న వ్యవస్థతో పోలిస్తే పైరసీ ఇండస్ట్రీ అంతకు ఎన్నో రెట్లు బలమైనది. పైరసీ బయటకు మామూలు విషయంగానే కనిపించవచ్చు. ఇదే పైరసీ టీమ్స్ డ్రగ్స్ లాంటి ఇతర క్రిమినల్ చర్యల వైపు వెళితే ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. మరిన్ని చట్టాలతో పైరసీని అరికట్టే దిశగా అందరం కృషి చేయాలి” అంటూ ఆయన ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

Exit mobile version