
మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా దర్శకుడు సంపత్ నంది రూపొందిన సినిమా ‘బెంగాల్ టైగర్’. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది, బెంగాల్ టైగర్‌ను రవితేజ స్టైల్లో ఓ మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో, ట్రైలర్ ఈమధ్యే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ రెండో వారంలోనే విడుదల చేయాలని మొదట ప్లాన్ చేశారు. కాగా అదే వారానికి అఖిల్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించిన నేపథ్యంలో బెంగాల్ టైగర్ రిలీజ్ డేట్‌పై స్పష్టత కొరవడింది. అఖిల్ సినిమా అనుకున్నట్లుగానే దీపావళికి వస్తే, బెంగాల్ టైగర్ మరో రెండు వారాలు వెనక్కి వెళ్ళేలా ప్లాన్ చేశారు. ఇక గత కొద్దిసేపటి క్రితం నాగార్జున, అఖిల్ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 11న విడుదల కానుందని స్పష్టం చేయడంతో బెంగాల్ టైగర్ ముందే ప్లాన్ చేసుకున్నట్లు నవంబర్ నెలాఖరుకు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం బెంగాల్ టైగర్ నవంబర్ 27వ తేదీకి ఫిక్స్ అయింది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. బొమాన్ ఇరానీ, హర్ష వర్ధన్ రానే వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ఉంటాయని సినిమా యూనిట్ చెబుతోంది.