రీమేక్‌తో కన్నడ ఎంట్రీ ఇవ్వనున్న టాప్ ప్రొడ్యూసర్!

allu-arvind
‘భలే భలే మగాడివోయ్’.. ఓ మిడిల్ లెవెల్ బడ్జెట్ సినిమాగా రూపొంది బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా. నాని హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ డ్రామాను హిందీ, తమిళం లాంటి ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు పలు పెద్ద సంస్థలు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే కన్నడ రీమేక్ విషయంలోనూ ఇదే తరహాలో ఓ ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి వచ్చింది. తెలుగులో టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన అల్లు అరవింద్, మరో కన్నడ ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్‌తో కలిసి ‘భలే భలే మగాడివోయ్’ రీమేక్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట.

తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థకు అనుబంధ సంస్థగా వచ్చిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై భలే భలే మగాడివోయ్ రూపొందగా, ఇప్పుడు కన్నడలోనూ తమ సంస్థలోనే నిర్మించాలని అల్లు అరవింద్ ఆలోచన చేశారని తెలుస్తోంది. రాక్‌లైన్ వెంకటేష్‌తో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇక ఈ రీమేక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇదే సినిమాను హిందీలోనూ గీతా ఆర్ట్స్ సంస్థే స్వయంగా నిర్మించాలని భావిస్తోంది. తమిళంలో జీవీ ప్రకాష్ భలే భలే మగాడివోయ్ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version