యంగ్ హీరో తనీష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మహాప్రస్థానం. గతంలో ‘అంతకుమించి’ వంటి హారర్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు జాని, తన రెండో చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఓంకారేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న మహాప్రస్థానం చిత్రాన్ని క్రైమ్ నేపథ్యంలో హృదయానికి హత్తుకునే ప్రేమకథతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా డిసెంబర్ తొలివారం నుంచి చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీనితో చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు జాని మాట్లాడుతూ…’ఇదొక యాక్షన్ ఎమోషనల్ లవ్ స్టోరీ. కథానాయకుడి కోణంలో కథ సాగుతుంది. ఈ భావోద్వేగ ప్రేమ కథకు తనీష్ సరిగ్గా సరిపోతారు. కథానాయకుడి ప్రేమ, బాధ, కోపం సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథలో మనల్ని లీనం చేస్తుంది. డిసెంబర్ తొలివారం నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించబోతున్నాం. నిరవధికంగా షూటింగ్ చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నాం’ అన్నారు. కబీర్ దుహాన్ సింగ్, అమిత్, గగన్ విహారి, కంచెరపాలెం రాజు తదితర నటీనటులు ఇతర పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం సునీల్ కశ్యప్ అందించగా సిినిమాటోగ్రఫీ ఎమ్ ఎన్ బాల అందిస్తున్నారు.
