ఎస్వీ కృష్ణారెడ్డి ‘వేదవ్యాస్’ హీరోగా పిడుగు విశ్వనాథ్ పరిచయం

1 9

తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో ఎన్నో ఘన విజయాలను సాధించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న 43వ చిత్రం “వేదవ్యాస్”. ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్‌గా నటించడం విశేషం. కాగా నిర్మాత కె. అచ్చిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన వేడుకల్లో “వేదవ్యాస్” హీరోగా పిడుగు విశ్వనాథ్‌ను అధికారికంగా పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు సాయికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నటుడు సాయికుమార్ మాట్లాడుతూ అచ్చిరెడ్డి-కృష్ణారెడ్డి కాంబినేషన్‌లో నటించడం ఇదే తొలిసారి అని, గతంలో వారి చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన అనుబంధం ఉందని తెలిపారు. “వేదవ్యాస్” సినిమాలో వేద నారాయణ అనే మంచి పాత్రలో నటిస్తున్నానని, కుటుంబమంతా కలిసి చూసేలా మంచి సందేశంతో ఎస్వీ కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని చెప్పారు. అలాగే పిడుగు సుబ్బారావు గారి కుమారుడు పిడుగు విశ్వనాథ్ హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని, సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు.

జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. తాను ఎన్నో స్టార్ హీరోల సినిమాలకు పీఆర్ఓగా పనిచేశానని, అచ్చిరెడ్డి-కృష్ణారెడ్డి గార్లతో స్నేహం ఉన్నప్పటికీ ఇప్పటివరకు వారి చిత్రాలకు పనిచేయలేదని చెప్పారు. ఇటీవల తన జీవితంలో ఎదురైన విషాదం నుంచి బయటపడేలా, తాను బిజీగా ఉండాలనే మంచి ఉద్దేశంతో అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు “వేదవ్యాస్” సినిమాకు పీఆర్ఓగా అవకాశం ఇచ్చారని, వారి గొప్ప మనసుకు ఇది నిదర్శనమన్నారు. అలాగే కృష్ణారెడ్డి గారు చెప్పిన కథ ఎంతో బాగుందని, ప్రేక్షకుల ముందుకు ఒక గొప్ప చిత్రం రాబోతుందని తెలిపారు.

హీరో పిడుగు విశ్వనాథ్ మాట్లాడుతూ.. “వేదవ్యాస్” సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి సినిమాతో పరిచయం కావడం తన అదృష్టమన్నారు. అలాగే తన నటనకు, లుక్‌కు సహకరించిన టీమ్‌ అంతటికీ ధన్యవాదాలు చెబుతూ, గతంలో ఏడీగా పని చేసే అవకాశం ఇచ్చిన నీరజ కోన, త్రికోటి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రొడ్యూసర్ కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ, “వేదవ్యాస్” స్క్రిప్ట్‌ను ఎస్వీ కృష్ణారెడ్డి ఐదారేళ్లుగా ఎంతో కష్టపడి సిద్ధం చేశారని, ప్రతి అంశం కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో కొరియా నుంచి హీరోయిన్ జున్ హ్యున్ జీని, మంగోలియాలో విలన్‌ను ఎంపిక చేశారని చెప్పారు. కొత్త హీరోగా విశ్వనాథ్‌ను తీసుకోవడం సరైన నిర్ణయమని, సాయికుమార్ గారు కీలక పాత్రలో అద్భుతంగా నటించారని తెలిపారు. జ్ఞానాన్ని ప్రపంచానికి పంచే భావనతో రూపొందిన ఈ కథను కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఇష్టపడి నిర్మించారని, సినిమాలో విశ్వనాథ్ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.

డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, విశ్వనాథ్‌ను హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉందని, ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో ఆయన అద్భుతంగా నటించి మంచి ఫైట్స్ చేశారని అన్నారు. అలాగే వేద నారాయణ అనే కీలక పాత్రలో సాయికుమార్ గారు సహజమైన నటనతో తనకు దర్శకుడిగా ఎంతో సంతృప్తి ఇచ్చారని తెలిపారు. కొరియన్ హీరోయిన్ తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పిందని, మంగోలియా విలన్ కూడా బాగా నటించాడని పేర్కొంటూ, భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని చాటే ఈ చిత్రం విశేషాలు సినిమాల్లోనే చూడాలని చెప్పారు.

Exit mobile version