ఘనంగా గనుల పర్యావరణ, ఖనిజ సంరక్షణ వారం ముగింపు వేడుకలు

1 3

హైదరాబాద్‌లోని జాన్వాడలో 31వ గనుల పర్యావరణ, ఖనిజ సంరక్షణ వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరుకు చెందిన పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (అదానీ సిమెంట్) ఆతిథ్యం ఇచ్చిన ఈ కార్యక్రమంలో, మైనింగ్ నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలకు పురస్కారాలు అందజేశారు.

తెలంగాణ వ్యాప్తంగా 2025 డిసెంబర్ 15 నుంచి 20 వరకు ఈ వారోత్సవాలు జరిగాయి. ఇందులో 35 గనులు (30 యంత్రసామగ్రి ఆధారిత, 5 మాన్యువల్) పాల్గొన్నాయి. సీనియర్ అధికారుల బృందాలు ఈ గనులను సందర్శించి పర్యావరణ రక్షణ, సామాజిక అభివృద్ధి, సుస్థిర విధానాలను సమీక్షించాయి.

ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (IBM) కంట్రోలర్ జనరల్ పంకజ్ కుల్ష్రేష్ఠ మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలగకుండా శాస్త్రీయ పద్ధతుల్లో మైనింగ్ జరగాలన్నారు. తవ్వకాలు పూర్తయ్యాక భూమిని వృక్షారోపణ ద్వారా తిరిగి పచ్చగా మార్చాలని సూచించారు. కొత్త టెక్నాలజీతో సుస్థిర మైనింగ్ సాధ్యమవుతోందని ఐబీఎం డిప్యూటీ కంట్రోలర్ ఆర్. రామ్‌కిషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. వై.జి. కాలే, శైలేంద్ర కుమార్, పెన్నా సిమెంట్ సీఈఓ సుకురు రామారావు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version