ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీపై టొవినో క్లారిటీ.. చాలా కష్టమట..!

NTRNeel 3

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియడ్ డ్రామా ‘పళ్లిచట్టంబి’ విడుదలకు సిద్ధమైంది. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో కేరళ వలస రైతు సంఘాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 10న పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలుగులో ప్రమోషన్స్ ప్రారంభించగా, టొవినో థామస్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్‌లో చర్చనీయాంశంగా మారాయి.

నేరుగా తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారని అడిగిన ప్రశ్నకు టొవినో ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘నాకు తెలుగు సినిమాలు చేయడం ఇష్టమే, కానీ ఇక్కడి పని తీరు మలయాళంతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మలయాళంలో మేము సినిమాను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం. కానీ తెలుగులో సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది, మల్టిపుల్ షెడ్యూల్స్ ఉంటాయి’ అని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఒక తెలుగు సినిమా కోసం ఏడాది పాటు వేచి చూడాల్సి వస్తుందని. ఆ సమయంలో తాను 4 నుండి 5 మలయాళ సినిమాలు పూర్తి చేయగలనని ఆయన వివరించారు.

ముఖ్యంగా, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్టులో తాను నటించడం లేదని టొవినో స్పష్టం చేశారు. ఒకే సినిమాకు అన్ని డేట్స్ కేటాయించడం తన వల్ల కాదని ఆయన చెప్పడం ఎన్టీఆర్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. తాను ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరొకటి చేస్తానని, ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడం ఇష్టం ఉండదని టొవినో తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Exit mobile version