సమీక్ష : కార్మేని సెల్వం – అక్కడక్కడా మెప్పించే  ఎమోషనల్ డ్రామా

Carmeni Selvam

విడుదల తేదీ : ఏప్రిల్ 03, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియ, అభినయ తదితరులు
దర్శకత్వం : రామ్ చక్రి
నిర్మాత : అరుణ్ రంగరాజులు
సినిమాటోగ్రఫీ : యువరాజ్ దక్షన్
సంగీతం : రామానుజన్
ఎడిటింగ్ : జగన్ ఆర్.వి – దినేష్.ఎస్
సంబంధిత లింక్స్ : ట్రైలర్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని లీడ్ రోల్‌లో, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్మేని సెల్వం’. మిడిల్ క్లాస్ జీవితాల్లోని ఆర్థిక ఇబ్బందులు, ఆశలు మరియు ఆవేదనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:

సెల్వం (సముద్రఖని) ఒక సిన్సియర్ డ్రైవర్. తన భార్య శాంతి (లక్ష్మీ ప్రియ), కొడుకు బాలుతో కలిసి ఒక చిన్న ఇంట్లో సంతోషంగా జీవిస్తుంటాడు. సంపాదన తక్కువైనా ఉన్నదానితో తృప్తిగా ఉండే మనస్తత్వం అతనిది. కానీ, సమాజంలో గౌరవం కోసం, ఆర్థికంగా ఎదగాలనే ఆశతో అతని భార్య పడే తాపత్రయం సెల్వంను అప్పుల ఊబిలోకి నెట్టేలా చేస్తుంది. తన యజమాని సంపత్ (గౌతమ్ మీనన్) కారును అతడికి తెలియకుండా క్యాబ్‌గా నడపడం, క్రెడిట్ కార్డుల వాడకం వంటి కారణాలతో సెల్వం జీవితం ఎలా తలకిందులైంది? ఆ అప్పుల నుండి బయటపడటానికి అతను చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరికి సెల్వం తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

ఎప్పటిలాగే సముద్రఖని తన న్యాచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, అప్పుల బాధలో నలిగిపోయే సగటు మనిషిగా ఆయన నటన సినిమాకు ప్రధాన బలం. తండ్రి-కొడుకుల మధ్య వచ్చే సీన్స్, అలాగే మధ్యతరగతి గృహిణిగా లక్ష్మీ ప్రియ నటన చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక కుటుంబం పడే వేదనను దర్శకుడు బాగా చూపించాడు.

ఉన్నదానితో తృప్తి గా ఉండాలి, అప్పులు చేసి ఆడంబరాలకు వెళ్లకూడదు అనే పాయింట్ నేటి సమాజానికి అవసరమైన మంచి మెసేజ్. ఈ సందేశాన్ని ఈ సినిమాలో చూపెట్టిన విధానం చాలా మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఇట్టే కనెక్ట్ అవుతుంది.

ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఈ చిత్ర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. సినిమా మూడ్‌కి తగ్గట్టుగా బీజీఎం సాగడం సినిమాకు కలిసొచ్చింది. మిడిల్ క్లాస్ జీవితాన్ని ఈ చిత్ర సినిమాటోగ్రఫీతో చాలా చక్కగా చూపెట్టారు.

మైనస్ పాయింట్స్:

సినిమా ప్రారంభం నుండి చివరి వరకు చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. దీనివల్ల ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. రొటీన్ టెంప్లేట్ కావడంతో ఎక్కడా కూడా ఎగ్జైటింగ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది.

కథలో పెద్దగా ట్విస్టులు ఏమీ లేవు. తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించేలా సినిమా సాగుతుంది. రెగ్యులర్ డ్రామా తరహాలోనే స్క్రీన్ ప్లే ఉండటం మైనస్. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ లేదా ఎంటర్టైన్మెంట్ ఆశించే వారికి నిరాశే ఎదురవుతుంది. ఇది పూర్తిగా ఒక సీరియస్ ఫ్యామిలీ డ్రామా.

సముద్రఖని పర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి వంక పెట్టడానికి లేదు. కానీ, ఆయన పాత్రకు తెలుగు డబ్బింగ్ అంతగా సెట్ అవ్వలేదు. ఎక్కువగా తమిళ ఫ్లేవర్ వినిపిస్తుంది. గౌతమ్ మీనన్ పాత్రను కూడా సరిగ్గా ట్రీట్ చేయనట్లు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

దర్శకుడు రామ్ చక్రి ఈ సినిమాకు తీసుకున్న కథ చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో జరిగే సన్నివేశాలను మనకు ఇందులో కనిపిస్తాయి. అయితే, వారి మధ్య సాగే ఎమోషనల్ బాండింగ్ సీన్స్ మాత్రం చక్కగా చూపెట్టారు. భార్య, కొడుకుతో సముద్రఖని గడిపే జీవితం ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటారు. ఇక లేని ఆర్బాటాలకు పోయి అప్పుల పాలవ్వడం వంటి సీన్స్‌ను డైరెక్టర్ బాగా రాసుకున్నాడు. కానీ, కథను ముందుకు తీసుకెళ్లేందుకు స్క్రీన్ ప్లేను చాలా స్లోగా సాగదీయడం మెప్పించదు. మిడిల్ క్లాస్ జీవితాన్ని సినిమాటోగ్రఫీ చక్కగా ప్రజెంట్ చేసింది. రామానుజన్ అందించిన బీజీఎం సినిమాకు చక్కగా కుదురింది. ఎడిటింగ్ పరంగా ఇంకా బెటర్‌గా వర్కవుట్ చేయాల్సింది. చాలా సీన్స్ ట్రిమ్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

ఓవరాల్‌గా చూస్తే.. ‘కార్మేని సెల్వం’ ఒక సిన్సియర్ అటెంప్ట్ అని చెప్పాలి. మిడిల్ క్లాస్ జీవితాల్లోని ఆర్థిక సమస్యలను, నైతిక విలువలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సముద్రఖని నటన మరియు ఎమోషనల్ కంటెంట్ బాగున్నప్పటికీ, చాలా స్లోగా సాగే కథనం మరియు ఆసక్తికరమైన ట్విస్టులు లేకపోవడం సినిమాకు మైనస్. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Exit mobile version