పోకిరి @ 20 : పండుగాడు కొడితే టాలీవుడ్ మైండ్ బ్లాక్ అయ్యింది..!

Pokiri

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ చిత్రం రిలీజ్ అయ్యి అప్పుడే 20 ఏళ్లు పూర్తయ్యింది. 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ చిత్రం అనేక రికార్డులను బ్రేక్ చేసింది. ఒక క్లాస్ హీరోని మాస్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మార్చిన సినిమాగా పోకిరి చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా, మహేష్ బాబు పర్ఫార్మెన్స్.. పూరి విజువల్ బ్రిలియన్స్ గురించి మాట్లాడకుండా ఉండలేరు.

ఒంటినిండా యాటిట్యూడ్ నింపుకున్న ఒక బేవార్స్ హీరో పండుగాడుని సినిమా క్లైమాక్స్‌లో టాప్‌లో తీసుకెళ్లి కూర్చొబెట్టిన తీరుకి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఎలాంటి భారీ డైలాగులు లేకుండా.. ‘షెడ్డు బాగుంది.. కొట్టుకోవడానికి ఈ మాత్రం ఉండాలి’ అంటూ ఓ సింపుల్ మాస్ డైలాగ్‌ను ఎలివేట్ చేసిన తీరు అద్భుతం. ఇక మహేష్ తనదైన మ్యానరిజంతో చెప్పిన ‘ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోద్దో ఆడే పండుగాడు’ అనే డైలాగ్ ఇప్పటికీ ఒక ఎమోషన్.

ఆవారాగా తిరిగే హీరోకి ఇలియానాతో రొమాంటిక్ ట్రాక్.. మధ్యలో వచ్చే బ్రహ్మానందం కామెడీ.. అటు ప్రకాష్ రాజ్ విలనిజం.. మణిశర్మ ఎవర్‌గ్రీన్ సాంగ్స్.. ఇలా ఫక్తు కమర్షియల్ అంశాలతో పూరి వండివార్చిన ‘పోకిరి’ మాస్ సెంటర్స్‌లో బీభత్సం సృష్టించింది. ఈ సినిమా సబ్జెక్ట్‌పై నమ్మకంతో మహేష్ తన సోదరి మంజుల ఘట్టమనేనితో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయించాడు.

ఇక టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ పండుగాడు సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. దాదాపు రూ.17 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించగా, బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.70 కోట్ల మేర ఈ చిత్రం వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌తో మహేష్ బాబు సూపర్ స్టార్‌గా మారిపోయి టాలీవుడ్‌ను రూల్ చేస్తున్నాడు. ఇక భవిష్యత్తులో ఎన్ని పాత్రలు వచ్చినా, పూరి జగన్నాథ్ సృష్టించిన ఆ పండుగాడి మ్యాజిక్‌ను మళ్లీ రీక్రియేట్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.

Exit mobile version