సౌత్ ఇండియాలో వరుసగా సినిమాలు చేసి బాగా పేరు తెచ్చుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు కూడా చేస్తుంది. ఇక్కడ వరుస హిట్స్ అందుకున్న ఈ మిల్క్ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ లో బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. త్వరలోనే తమన్నా అక్షయ్ కుమార్ సరసన నటించిన ‘ఎంటర్టైన్మెంట్’ సినిమా కూడా విడుదల కానుంది. ఈ సందర్భంగా తమన్నాతో కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) సౌత్ మరియు బాలీవుడ్ ప్రమోషన్స్ లో మీరు చూసిన పెద్ద తేడా ఏమిటి.?
స) నేను చూసిన తేడా అంటే.. సౌత్ లో ప్రమోషన్స్ కోసం తక్కువ టైం స్పెండ్ చేస్తారు. అదే బాలీవుడ్ లో అయితే ఎక్కువ టైం తీసుకుంటారు. నాకు తెలిసి ఇప్పటి వరకూ బాలీవుడ్ లా ఇక్కడ ఎప్పుడూ ప్రమోషన్స్ జరగలేదు. కానీ అలా చేస్తేనే మన సినిమా వరల్డ్ వైడ్ ఉన్న అందరికీ తెలుస్తుంది. అందుకే నేను తెలుగులో సినిమా చేస్తున్నాను అంటే ఎక్కువగా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనడానికి ట్రై చేస్తాను.
ప్రశ్న) బాలీవుడ్ లో సినిమాలు చేయడం వల్ల సౌత్ లో సినిమాలు తగ్గించినట్టున్నారు.?
స) అందులో ఎలాంటి నిజం లేదండి. అవన్నీ జస్ట్ రూమర్స్.. ప్రస్తుతం తెలుగులో ‘బాహుబలి’, ‘ఆగడు’ అనే భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాను. ఇవి రెండు పెద్ద సినిమాలు. 2 లేదా 3 నెలల్లో అయిపోయే సినిమాలు కాదు. ఎక్కువ టైం తీసుకుంటాయి. ఇవి రెండు కాకుండా తమిళంలో కూడా ఓ సినిమా చేస్తున్నాను. ఇక ఖాళీ ఎక్కడుంది, వేరే సినిమాలు చేయడానికి.. అదీ కాక నేను ఎప్పుడూ ఒకేసారి 6 లేదా 7 సినిమాలు చెయ్యలేదు.
ప్రశ్న) ‘ఆగడు’లో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారని వస్తున్న వార్తలపై మీ కామెంట్.?
స) కాదు.. కాదు అది కూడా రూమర్.. ఆగడు లో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడం లేదు. ఇందులో నేను ఒక విలేజ్ లో ఉండే స్వీట్ షాప్ ఓనర్ పాత్రలో కనిపిస్తాను.
ప్రశ్న) మొదటిసారి మహేష్ బాబుతో కలిసి చేయడం ఎలా ఉంటుంది.?
స) మహేష్ బాబుతో కలిసి పనిచేయడం లక్కీగా ఫీలవుతున్నాను. చెప్పాలంటే మహేష్ చూడటానికి చాలా బాగుంటాడు. ఆయన ఉంటే పక్కన ఎవరున్నా వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. అందుకే నేను సెట్లో శ్రీను గారితో మహేష్ గారు అంత బాగా కనిపిస్తే నేనెక్కడ కనిపిస్తానండి అని అడుగుతూ ఉంటాను. ఇది పక్కన పెడితే శ్రీను వైట్ల – మహేష్ బాబుతో కలిసి పనిచేయడం లక్కీగా ఫీలవుతున్నాను. ‘ఆగడు’ సినిమా మహేష్ బాబు అభిమానులకి పెద్ద ట్రీట్ అని మాత్రం చెప్పగలను.
ప్రశ్న) మరి ‘బాహుబలి’ గురించి ఏమన్నా చెప్పండి.? రెండు పార్ట్స్ లో మీరు ఏ పార్ట్ లో కనిపిస్తారు.?
స) ‘బాహుబలి’లో నేనొక వారియర్ ప్రిన్సెస్ లా కనిపిస్తాను. నేను ఫస్ట్ పార్ట్ లో కనిపిస్తాను. నా పాత్ర గురించి ఇంతకన్నా ఏమీ చెప్పలేను. బాహుబలి మాత్రం మీ అందరి ఊహలకు మించి ఉంటుంది. వాళ్ళు ఎంత పెద్ద రేంజ్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఊహించలేరు. ఎందుకంటే నేను సెట్లో ఉండి సినిమా చేస్తున్నాను. కానీ రాజమౌళి గారు ఏం చేస్తున్నారా? ఎలా ఊహించి తీసున్నారా? అనేది నా ఊహకే అందడం లేదు. కాబట్టి ప్రేక్షకుల ఊహకు మించి ఈ సినిమా ఉంటుంది. బాహుబలి ఎలా ఉంటుందా అనేది రాజమౌళి గారికి మాత్రమే క్లారిటీ ఉంది.
ప్రశ్న) బాహుబలి కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం లాంటి స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారా.?
స) ఇంకా లేదండీ.. ట్రైనింగ్ సెక్షన్ ఉంది కానీ ఇంకా అది మొదలు కాలేదు. ప్రస్తుతానికి కొన్ని సీన్స్ మరియు ప్రభాస్ నాపై కలిపి ఓ సాంగ్ ని షూట్ చేసారు.
ప్రశ్న) అల్లుడు శీనులో స్పెషల్ సాంగ్ చేయడానికి గల కారణం ఏమిటి? ఇక ముందు కూడా స్పెషల్ సాంగ్స్ లో కనిపిస్తారా.?
స) అల్లుడు శీనులో స్పెషల్ సాంగ్ చెయ్యడానికి గల కారణం వివి వినాయక్ గారు, బెల్లంకొండ సురేష్ గారు.. వాళ్ళతో సాంగ్ చేస్తే పర్ఫెక్ట్ గా తీయగలరు, అలాగే వాళ్ళతో కంఫర్టబుల్ లెవల్ ఉంటుంది అందుకే ఈ సాంగ్ చేసాను. స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయడం బాలీవుడ్ లో కామన్. కానీ టాలీవుడ్ లో అలాంటి ట్రెండ్ లేదు. ఇక ముందు కూడా డైరెక్టర్ చూపించే విధానాన్ని బట్టి, నాకు వాళ్ళిచ్చే కంఫర్టబుల్ లెవల్స్ ని బట్టి స్పెషల్ సాంగ్స్ చేస్తాను..
ప్రశ్న) మీరు చేసిన బాలీవుడ్ సినిమాలు హిట్ అవ్వలేదు.. ఆ విషయంలో మీరేమన్నా నిరుత్సాహంగా ఉన్నారా.?
స) మీరన్నట్టు నేను చేసిన రెండు సినిమాలు హిట్ అవ్వలేదు. సినిమా పరంగా నేను చాలా కష్టపడతాను, అలాగే బాగా ప్రమోట్ చేస్తాను కానీ సినిమా ఆడలేదు అంటే దానికి నేనేం చేయలేను. ఆ విషయాన్ని సీరియస్ గా కూడా తీసుకోను. చెప్పాలంటే తెలుగులో నేను చేసిన మొదటి 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, 5వ సినిమా ‘హ్యాపీ డేస్’ ద్వారా బ్రేక్ వచ్చింది. 2 సినిమాలు ఫ్లాప్ అయినప్పుడే నా కెరీర్ అయిపోయింది అనుకోని ఉంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. అందుకే ఫ్లాప్స్ ని ఎక్కువ సీరియస్ గా తీసుకోను.
ప్రశ్న) మీరు భవిష్యత్తులో కూడా సౌత్ మరియు బాలీవుడ్ సినిమాలను మేనేజ్ చేయగలరా.?
స) అవును మేనేజ్ చెయ్యగలను. నా టార్గెట్ అదే..గతంలో సౌత్ – బాలీవుడ్ కి ఇంత కనెక్షన్ ఉండేది కాదు. ఇప్పుడది మారిపోయింది. ఎందుకంటే ఈ మధ్య కంటిన్యూగా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేడ్ అవుతున్నాయి. అక్కడ రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తున్నాయి. నాకు తెలిసి కొద్ది రోజులకి టాలీవుడ్, బాలీవుడ్ అనేవి ఉండవు. కేవలం ఇండియన్ సినిమానే ఉంటుందని భావిస్తున్నాను.
అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి తమన్నా కెరీర్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాము..


