తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు. ‘మగధీర’, ‘ఈగ’ సినిమాలతో టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళారు. కెమెరా వెనుక ఉంటూ అద్బుతాలు సృష్టిస్తున్న రాజమౌళి గొప్ప దర్శకుడు మాత్రమె కాదు, మంచి నటుడు కూడా. దర్శకత్వంపై జక్కన్నకు మక్కువ పెరగడం వలన ఆయనలో నటుడిని ప్రేక్షకులు చూడలేకపోయారు. చిన్నతనంలోనే రాజమౌళి ముఖానికి మేకప్ వేస్తున్నారు. దర్శకుడు కాకముందు చిలిపి కృష్ణుడుగా ఒక సినిమాలో నటించారు. అది చాలా చిన్న వయసులో. విడుదలకు నోచుకోని ఒక సినిమాలో చిన్ని కృష్ణుడు పాత్ర పోషించారు.
‘నా చిన్న వయసులో కృష్ణుడి పాత్రలో నటించాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పూర్తి కాలేదు’ అని సోషల్ మీడియాలో అభిమానులకు తెలియజేశారు. కృష్ణాష్టమి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు రాజమౌళి.


