
మూవీ మొఘల్ డా. డి. రామానాయుడు నిర్మాణ సారధ్యంలో వచ్చిన ‘తాజ్ మహల్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన లేడీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎంశ్రీ లేఖ. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఏకైక లేడీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ కావడం విశేషం. ఇప్పటి వరకూ తెలుగు, హిందీ, తమిళ కన్నడ భాషల్లో పలు సినిమాలకు మ్యూజిక్ చేసిన శ్రీ లేఖ ఎన్నో హిట్ సినిమాలకు కూడా మ్యూజిక్అందించింది. రేపు శ్రీలేఖ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆమెతో కాసేపు చిట్ చాట్ చేసాం. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) పుట్టిన రోజు స్పెషల్ ఏమిటండి.?
స) నవ్వుతూ…ఎక్కడండి గణనాధుడు నిమజ్జనం పేరుతో సెలబ్రేట్ చేసుకోనివ్వకుండా అడ్డేశాసాడు.. (నవ్వులు). ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ‘ సరదాగా కాసేపు’ స్పెండ్ చెయ్యడమే బర్త్ డే స్పెషల్..
ప్రశ్న) ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 సంవత్సరాలైంది.. ఈ జర్నీ ఎలా ఉందో చెప్పండి.?
స) మీరన్నట్టు ఈ 18 సంవత్సరాల జర్నీ చాలా బాగుంది. చెప్పుకోవడానికి చెడు సంఘటనలు ఏమీ లేవు అన్ని మంచి అనుభవాలే ఉన్నాయి. అందరూ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ అని చూడకుండా ఎంకరేజ్ చేసారు. ఇప్పుడున్న పేరుని ఇలానే నిలబెట్టుకోవాలి.
ప్రశ్న) కెరీర్ మొదటి నుంచి సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు. మీ పరంగా మీకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చేది ఏది.?
స) నా వరకూ నేను రెండింటిని సమానంగా ఎంజాయ్ చేస్తాను, రెండూ నాకు సంతృప్తినిస్తున్నాయి. సింగింగ్ విషయానికి వస్తే – వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో పనిచేసే అనుభవం ఒక్కోలా ఉంటుంది, ఒకరు కోపంగా చెప్తారు, ఒకరు అలా కాదని ఇలా చెప్పి చేయించుకుంటారు, మరొకరేమో కూల్ గా ఇంకో టేక్ చేద్దాం అంటారు. కానీ ఇదంతా బాగా జాయ్ ఫుల్ గా సాగిపోతుంది.
ఇక మ్యూజిక్ డైరెక్షన్ అంటే ఒక రెస్పాన్సిబిలిటి. డైరెక్టర్ కి సినిమా మీద ఎంత బాధ్యత ఉంటుందో మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా అంతే బాధ్యత ఉంటుంది. అలాగే సింగింగ్ కంటే మ్యూజిక్ డైరెక్షన్ లో ఎక్కువ టెన్షన్ ఉంటుంది. సింగింగ్ అనేది చాలామంది చేయవచ్చు కానీ మ్యూజిక్ అనేది అందరూ చేయలేరు. ఇండస్ట్రీలో నేను ఒక్కదాన్నే లేడీ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాను అని తలచుకున్నప్పుడు ఒకవైపు ఆనందంగా ఉన్నా మరో వైపు టెన్షన్ ఉంటుంది. మరో లేడీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినా నా లెవల్ ని బీట్ చెయ్యకూడదనే ఆలోచనతోనే ఎప్పుడూ కంపోజ్ చేస్తాను.
ప్రశ్న) మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కువగా సొంత ఆల్బమ్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మరి మీరెందుకు ట్రై చెయ్యలేదు.?
స) ఆల్బమ్స్ చేయడం నాకు ఇష్టమే.. కానీ సరైన స్పాన్సర్స్ దొరికితే నేను ఆల్బమ్స్ చేస్తాను. ఎందుకంటే ఆల్బమ్ అనేది ఖర్చుతో కూడుకున్నది. ప్రస్తుతం మార్కెట్ కూడా చాలా డల్ గా ఉంది. అందుకే సరైన చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను.
ప్రశ్న) ఎంఎం కీరవాణి, మిగిలిన కుటుంబసభ్యుల నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది.?
స) కీరవాణి అన్నయ్య ఎప్పుడూ నాకు సపోర్ట్ ఇస్తుంటారు. ఇటీవలే స్వరాభిషేకంలో కూడా అందరి ముందు మెచ్చుకున్నారు. పార్క్ సినిమాలోని ‘గుండె తడి పెంచినట్లు’ అనే పాట పాడినప్పుడు ఒక గొలుసులా ఆ పాటని చాలా బాగా అల్లావు అని మెచ్చుకున్నారు. స్వతహాగా నేను కీ బోర్డ్ నేర్చుకోలేదు. కానీ మణిశర్మ గారు ఎప్పుడు ఎదురుపడినా ఈ అమ్మాయి కీ బోర్డ్ పైన వెళ్ళని పరిగెత్తిస్తుందని అంటుంటారు.
ఇకపోతే ఇంట్లో వాళ్ళనుంచి ఎప్పుడూ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఉదాహరణకి – శ్రీ గారి మ్యూజిక్ లో లిటిల్ సోల్జర్స్ లో ఓ పాట పాడటానికి వెళ్లాను. నాతో పాటు వళ్ళి వదిన, కంచి అన్నయ్య, కళ్యాణ్ అన్నయ్య వచ్చారు. మనం పాడుతుంటే మనవాళ్ళకి కచ్చితంగా నచ్చేస్తుంది అంటారు. అలా నేను ఎం పాడినా బాగుంది బాగుంది అంటున్నారు. శ్రీ గారు వాళ్ళని ఆపి నేను మ్యూజిక్ డైరెక్టరా లేక మీరా… ఇంకా బాగా రావాలి మరో టెక్ చేద్దాం అని చేయించుకున్నారు. ఇలా మా కుటుంబంలోని ప్రతి ఒక్కరు నాకు పూర్తి సపోర్ట్ ఇస్తారు.
ప్రశ్న) మీకు సంగీత గురువు ఎవరు.? అలాగే మీకు స్పూర్తినిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు.?
స) సంగీతంలో నాకు గురువు అంటే పెదనాన్న(కీరవాణి వాళ్ళ నాన్నగారు) శివశక్తి దత్తా గారే.. ఆ తర్వాత నేను ఇళయరాజా గారినే నా గురువుగా అనుకుంటాను. అందుకే ఆయన స్టైల్ టచ్ నా సాంగ్స్ లో కనపడుతుంది.
ప్రశ్న) మీరు చేయాలనుకునే డ్రీం ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? అలాగే కమర్షియల్ లేదా స్టార్ హీరోల సినిమాలకి ఎప్పుడు మ్యూజిక్ చేస్తారు.?
స) డ్రీం ప్రాజెక్ట్స్ అంటూ ఏమీ లేవు.. ప్రతిదానిలో కొత్తదనం ఉండాలనుకుంటాను. మాములుగా సీన్ లో కొత్తదనం ఉంటే మ్యూజిక్ కూడా చాలా బాగా వస్తుంది. అందుకే డైరెక్టర్ నుంచి కొత్త కథని ఆశిస్తాను. ఇక కమర్షియల్/స్టార్ హీరోలతో సినిమా చెయ్యాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. నాకు ఉంటుంది. కానీ ఇంకా రాలేదని బాధలేదు, వచ్చేటప్పుడు వస్తుందని భావిస్తాను. అప్పటివరకూ నాకు వచ్చిన ఆఫర్స్ కి పూర్తి న్యాయం చెయ్యాలి.
ప్రశ్న) ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాల గురించి చెప్పండి.?
స) ప్రస్తుతం తెలుగులో విఎన్ ఆదిత్య గారితో చేసిన ‘పార్క్’ విడుదలకి దగ్గరలో ఉంది. ఇది కాకుండా రెండు తమిళ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
అంతటితో శ్రీ లేఖతో మా ఇంటర్వ్యూని ముగించి, ఆమెకి అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం.

