
‘అపరిచితుడు’ సినిమా తర్వాత హీరో విక్రమ్, దర్శకుడు శంకర్ కలయికలో వస్తున్న సినిమా ‘ఐ’. ఈ సినిమాలో విక్రమ్ బీస్ట్ గా, బాడీ బిల్డర్ గా, సూపర్ మోడల్ గా, వికృత రూపంతో కూడిన వ్యక్తిగా వైవిధ్యమైన గెటప్ లలో కనిపించనున్నారు. ఒక పాత్ర కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడు. ఏకంగా 30 కిలోలు బరువు తగ్గారు. శంకర్ సూచన మేరకు విక్రమ్ బరువు తగ్గారని అప్పట్లో వార్తలు వచ్చాయి. బరువు తగ్గాలనే ఆలోచన విక్రమ్ దే అని తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు దర్శకుడు శంకర్.
‘నేను విక్రమ్ కు స్క్రిప్ట్ వినిపించినపుడు బరువు తగ్గాలని చెప్పలేదు. బరువు తగ్గితే ఆ పాత్ర చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని విక్రమ్ చెప్పాడు. బరువు తగ్గాలనే ఆలోచన విక్రమ్ దే. అతని ఆరోగ్యం దృష్ట్యా నేను ఈ విషయం గురించి చాలా రోజులు ఆలోచించాను. డాక్టర్స్, డైటీషియన్లను సంప్రదించిన తర్వాత ఓకే చెప్పాను. అని శంకర్ తెలిపారు. సినిమా కోసం విక్రమ్ ఎంత కష్టపడతాడో ఈ సంఘటన మరోసారి ఋజువు చేసింది.

