
విశాఖలో ప్రకృతి హుధూద్ తుఫాన్ రూపంలో విలయతాండవం చేసింది. ఎందరో సామాన్య ప్రజలు ఈ తుఫాన్ ప్రభావం వలన నష్టపోయారు. హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం తెలుగు చిత్ర పరిశ్రమ నవంబర్ 30న ‘మేము సైతం’ – వుయ్ లవ్ వైజాగ్ పేరుతో టెలీ మారథాన్ సహాయ కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం వివరాలను తెలియజేయడానికి నేడు పరిశ్రమ ప్రముఖులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణరావు, మోహన్ బాబు, కృష్ణంరాజు, ఎన్.వి.ప్రసాద్, కెఎస్ రామారావు, కెఎల్ నారాయణ, శ్యాం ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, పరుచూరి గోపాల కృష్ణ, సి.కళ్యాణ్, అశోక్ కుమార్, కొడాలి వెంకటేశ్వరరావు, మంచు లక్ష్మి ప్రసన్న, యువహీరోలు నవదీప్, నాని, నిఖిల్, సందీప్ కిషన్, కమల్ కామరాజ్, శశాంక్, ఖయ్యూం, మనోజ్ నందం తదితరులు హాజరయ్యారు.
నవంబర్ 30వ తేదిన జెమినీ ఛానల్ లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఆ రోజు కార్యక్రమాలను వీక్షించే వారు సహాయం చేయాలనుకుంటే ఆన్ లైన్ లో సహాయం చేయొచ్చు. వారి కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఎకౌంటును తెరవనున్నారు. కార్యక్రమం జరిగే సమయంలో బ్యాంకు ఎకౌంటు వివరాలు స్క్రోలింగ్ అవుతాయని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.
దాసరి నారాయణరావు మాట్లాడుతూ… సినీ పరిశ్రమకి, ప్రజలకు మధ్య ఉన్న అనుభందం ఈనాటిది కాదు. ఎప్పుడు ఇలాంటి విపత్తులు సంభవించినా, సహాయం చేయడం కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఏకమై ముందడుగు వేసింది. గతంలో పలు సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు ఇండస్ట్రీలో వైషమ్యాలు, విబేధాలు, బేధాభిప్రాయాలు పక్కన పెట్టి అంతా ఒక్కతాటిపై నిలబడి చేస్తున్న కార్యక్రమం ‘మేము సైతం’. సురేష్ బాబు, శ్యాం ప్రసాద్, కెఎస్ రామారావు తదితరులు కార్యక్రమాన్ని చాలా చక్కగా ప్లాన్ చేశారు. ప్రజలకు సహాయం చేయడం కోసం అందరూ కలసిరావడం మంచి పరిణామం. ఎవరికి ఎవరు విరోధులు మీరు చెప్పగలరా..? ప్రస్తుత పరిస్థితులలో అందరూ ఒకే రోజు మీడియా సమావేశానికి హాజరుకావడం కుదరని పని. ఎవరి వీలును బట్టి వారు సమావేశానికి హాజరయి తమ మద్దతు తెలుపుతున్నారు. దీనిపై లేనిపోనీ అపోహలు సృష్టించవద్దు. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదు. సినిమా, ప్రేక్షకులు మాత్రమే శాశ్వతం, వారి మధ్య అనుభందం శాశ్వతం. మేము పోయిన తర్వాత తరువాత తరం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. అని అన్నారు.
మోహన్ బాబు మాట్లాడుతూ.. ఇది చాలా భాదాకరమైన విషయం. తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు వంటివి. తెలుగు ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా వారికి సహాయం చేయడానికి తెలుగు చిత్రపరిశ్రమ ముందుంటుంది. ఒక నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా మా కుటుంబ సభ్యులతో కలసి 30 లక్షల రూపాయల విలువ గల ఆహార పదార్ధాలు విశాఖలో పంచడం జరిగింది. అలాగే మా విద్యాలయాలలో పని చేస్తున్న ఉద్యోగుల ఒక్క రోజు జీతం విరాళంగా ఇస్తున్నాం. ‘మేము సైతం’ అంటూ మేమంతా ఏకమై చేస్తున్న ఈ కార్యక్రమంలో పోల్గొంటున్నాం. ఈ కార్యక్రమం విజవంతం చేయాలని ప్రజలను కోరుతున్నాం. అని అన్నారు.
సురేష్ బాబు మాట్లాడుతూ.. నవంబర్ 30వ తేది నాడు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండి, కార్యక్రమానికి హాజరుకాలేని తారలు ముందుగా వాళ్ళ భాద్యతగా కామెడీ స్కిట్స్ లేదా ఇతర ప్రోగ్రామ్స్ రికార్డింగ్ చేసి పంపుతున్నారు. ప్రభాస్, రానా, అనుష్కలతో రాజమౌళి ఒక ప్రోగ్రాం ప్లాన్ చేశారు. త్రివిక్రమ్ – మహేష్ బాబు, రామ్ చరణ్ – అల్లు అర్జున్ – మారుతీ ఇలా టీమ్స్ గా ఏర్పడి ప్రత్యేక కార్యక్రమాలను చేస్తున్నారు. నందిని రెడ్డి డాన్సు కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. క్రిష్, అవసరాల శ్రీనివాస్ తదితరులు స్పెషల్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. కొందరు తారలు 30న లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తారు. అని అన్నారు.
ఒక మంచి ఉద్దేశ్యంతో చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో తమను కూడా భాగస్వాములు చేయడం పట్ల మంచు లక్ష్మి, నాని, నవదీప్, సందీప్ కిషన్, నిఖిల్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి సంబందించిన వార్తలను ఎప్పటికప్పుడు 123తెలుగు.కామ్ ఎక్స్ క్లూజివ్ గా పాఠకులకు అందిస్తుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూ ఉండండి.

