మెగా ఫ్యామిలీ నుంచి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న మరో హీరో, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ మొదటి సినిమా ‘ముకుంద’ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా చివరి దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా ఆడియోని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ఈ సినిమా పాటలకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా ఆడియో లాంచ్ లో కూడా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చెయ్యలేదు, అలాగే విడుదల చేసిన టీజర్ లో కూడా వరుణ్ తేజ్ చెప్పిన ఒక డైలాగ్ ని కూడా రివీల్ చెయ్యలేదు. దాంతో అభిమానులు కొంత నిరాశ పడ్డారు. వాళ్ళందరినీ మెప్పించడానికి ఈ సినిమా థియేటర్ ట్రైలర్ ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు యు ట్యూబ్ లో రిలీజ్ చెయ్యనున్నారు. అంతే కాకుండా రేపు విడుదల కానున్న లింగ సినిమాతో పాటు ముకుంద ట్రైలర్ ని వెయ్యనున్నారు. దీంతో ఈ సినిమాకి ప్రజల్లో మంచి రీచ్ వస్తుందని ఆశిస్తున్నారు.
గోదావరి బ్యాక్ డ్రాప్ లో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.


