
శుక్రవారం వచ్చిదంటే చాలు.. బాక్సాఫీస్ ముందు తమ భవిష్యత్‌ను పరీక్షించుకోడానికి సినిమాలు వచ్చి పడుతుంటాయి. అయితే.. ఈ వారం ఒకరోజు ముందే బాక్సాఫీస్ కళకళలాడబోతోంది. ఈనెల 5న ప్రధానంగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. అందులో నిఖిల్ హీరోగా నటించిన ‘సూర్య vs సూర్య’ ఒకటి కాగా, రెండోది ధనుష్ నటించిన డబ్బింగ్ సినిమా.. ‘అనేకుడు’.
‘సూర్య vs సూర్య’ విషయానికి వస్తే.. రెండు వరుస సూపర్ హిట్లతో జోరు మీదున్న హీరో నిఖిల్ ఒక సరికొత్త కథాంశంతో మన ముందుకు వస్తున్నాడు. ‘హ్యాపీడేస్’తో సినీ పరిశ్రమకు పరిచయమైన నిఖిల్.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలిగాడు. అయితే.. ఒకే రకమైన సినిమాలు తీస్తున్నాడన్న విమర్శతో ఆలోచనలో పడ్డాడు. ‘స్వామిరారా’ సినిమాతో ఆ మొనాటనీ నుంచి బయటకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. స్వామిరారా వంటి సూపర్ హిట్ తర్వాత మళ్ళీ ఒక కొత్త కథాంశాన్ని ఎన్నుకొని ‘కార్తికేయ’తో హిట్ కొట్టాడు. ఈ రెండు సినిమాలకూ కొత్తవారైన సుధీర్ వర్మ, చందు మొండేటి దర్శకులు కావడం విశేషం. వీరిద్దరూ నిఖిల్‌కు మిత్రులు కూడా. ఇక రెండు వరుస హిట్ల తర్వాత సూర్య vs సూర్య అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. సూర్యుడి ఎండ మీద పడితే తట్టుకోలేని ఒక అరుదైన వ్యాధి ఉన్న పాత్రలో నిఖిల్ నటిస్తున్నాడు. ఒక అందమైన ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. మరి ఈ సినిమా నిఖిల్‌కు హ్యాట్రిక్ తెచ్చిపెడుతుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.
ఇక మరో సినిమా ‘అనేకుడు’ విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అంటే దర్శకుడు కె. వి. ఆనం, హీరో ధనుష్. విభిన్న కథాంశాలతో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను తన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో తెరకెక్కించే దర్శకుడు కె.వి. ఆనంద్. ఆయన ఇంతకు ముందు తీసిన సినిమాలన్నీ (తెలుగులో డబ్ అయినవి) ఆ కోవలోనివే. వీడొక్కడే, రంగం, బ్రదర్స్ వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ ఆయనకు మంచి పేరుంది. ఒక సరికొత్త ప్రేమకథను తన స్టైల్లో ప్రెజెంట్ చేసిన సినిమా.. అనేకుడు. ఈ సినిమాలో హీరోగా నటించిన ధనుష్‌కి కూడా తెలుగులో మంచి పేరే ఉంది. ఈమధ్య కాలంలో ఆయన హీరోగా నటించిన సినిమా తెలుగులో రఘువరణ బీటెక్ పేరుతో విడుదలై మంచి రివ్యూ రాబట్టుకున్న విషయం తెలిసిందే. అనేకుడు సినిమా ఒరిజినల్.. ‘అనేగన్’ తమిళంలో ఫిబ్రవరి నెల్లోనే విడుదలై మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. పెద్దగా ప్రచారం లేకపోయినా ఈ సినిమాకి ఓపెనింగ్ ఫరవాలేదనిపించేలానే వస్తాయనేది అంచనా.
ఈ రెండు సినిమాలను పోల్చి చూస్తే.. సూర్య vs సూర్య సినిమాకి ఉన్న ప్రచారం, వైడ్ రిలీజ్ దృష్ట్యా మంచి ఓపెనింగ్‌ను రాబట్టుకునే అవకాశముంది. సినిమాకు హిట్ టాక్ గనక వస్తే ఇక కలెక్షన్లకు తిరుగుండదు. అనేకుడు సినిమాకి పెద్దగా ప్రచారం లేకున్నా, ఓ మోస్తారు ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. సినిమా ప్రేక్షకులకు ఏమేరకు నచ్చుతుందనేది సినిమా లాంగ్రన్నను ప్రభావితం చేస్తుంది. ఈ సినిమాలతో పాటు ఈనెల 6న ‘పంచమి’, ‘ఆనందం మళ్ళీ మొదలైంది’, ‘నాకైతే నచ్చింది’ లాంటి సినిమాలు విడుదలవుతున్నాయి.

