సౌత్ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గ్రాఫికల్ వండర్స్ అయిన సినిమాలు ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’. ఈ రెండు సినిమాల్లోనూ మెయిన్ లీడ్ రోల్ పాత్రలు పోషిస్తున్న హీరోయిన్ అనుష్క. అనుష్క ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబందించిన షూటింగ్ పూర్తి చేయడమే కాకుండా తన తదుపరి సినిమాని కూడా అధికారికంగా లాంచ్ చేసింది. ఆ సినిమానే ‘జీరో సైజ్’. పివిపి సినిమాస్ బ్యానర్ లో పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాకి రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్టర్.
మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం అనుష్క 20 కేజీల వెయిట్ పెరుగుతోంది. ప్రస్తుతం అనుష్క ఈ సినిమా కోసం వెయిట్ పెరిగే పనిలో ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమా టైటిల్ ఏమో జీరో సైజ్ అంటున్నారు. కానీ హీరోయిన్ అనుష్క మాత్రం 20 కేజీల వెయిట్ పెరిగింది అంటున్నారు. ఈ రెండిటికి పొంతన కుదరడం లేదేంటా అని ఆలోచించే వారి అనుమానాలు తీరాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే.
ఈ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ ఓ అతిధి పాత్రలో కనిపించడమే కాకుండా ఓ స్పెషల్ సాంగ్ లో కూడా స్టెప్పులేయనుంది. ఆర్య, భరత్, ఊర్వసి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించనున్న ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ – స్క్రీన్ ప్లే అందించనుంది.


