
హీరో మంచు విష్ణు పేరు ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్ష పదవికి తెరపైకొచ్చిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ఈ అసోసియేషన్‌కు ప్రస్తుతం నాటి హీరో, ఎంపీ మురళీ మోహన్ అధ్యక్షుడిగా ఉన్నారు. కొత్త కార్యవర్గం కోసం మార్చి 29న ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజేంద్రప్రసాద్ మొగ్గు చూపిన విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా మంచు విష్ణు పేరు సైతం తెరపైకి వచ్చింది.
‘మా’ అధ్యక్ష పదవిని ఎకగ్రీవంగానే ఎన్నుకునే సాంప్రదాయం పరిశ్రమలో ఉంది. గత రెండు దఫాలుగా మురళీ మోహన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆ పదవిని మళ్ళీ చేపట్టే ఆలోచన ఆయనకు లేదని సమాచారం. ఈ క్రమంలోనే కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకోబడతారా ? అనే ప్రశ్న సందడి చేస్తోంది.
మంచు విష్ణు.. ‘మా’ నిర్వహించే అన్ని కార్యక్రమాలను దగ్గరుండి నిర్వహించేవారు. అందుకే ఆయన పేరును పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. అయితే రాజేంద్రప్రసాద్‌ను కాదని విష్ణు పోటీలో ఉంటారా ? లేక పోటీలో నిలబడి అధ్యక్ష పదవిని చేపడతారా ? అన్నది వేచిచూడాలి.

