ఈమధ్య కాలంలో తెలుగులో మల్టీస్టారర్ల హవా ఎక్కువైంది. ఒకప్పటి ఈ క్రేజీ మల్టీస్టారర్లు కొన్నాళ్ళ వరకూ తగ్గిపోయాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మళ్ళీ ఊపందుకున్న ఈ ట్రెండ్.. ఆ తర్వాత వరుస సినిమాలతో కొనసాగుతోంది. తాజాగా ఈ మల్టీస్టారర్ జాబితాలోకి మరో భారీ సినిమా వచ్చిపడనుంది. మహేశ్, మోహన్ లాల్, ఆర్యలు హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ రూపొందనున్నట్టు సమాచారం. విజయ్, మోహన్లాల్లు నటించిన తమిళ సినిమా ‘జిల్లా’ దర్శకుడు నేశన్ ఈ సినిమాను పట్టాలెక్కించే యోచనలో ఉన్నారు.
తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మితమవనున్న ఈ సినిమాను పీవీపీ బ్యానర్లో ప్రసాద్ పొట్లూరి నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి మహేశ్ ‘శ్రీమంతుడు’ సినిమాతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత అడ్డాల దర్శకత్వం వహించనున్న ‘బ్రహ్మోత్సవం’లో నటిస్తారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాతే భారీ మల్టిస్టారర్ పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.


