2015లో సూర్య సినిమాల పండగ!

2015లో సూర్య సినిమాల పండగ!

Published on Mar 10, 2015 6:07 PM IST

Very_Happy_Surya
గత సంవత్సరం సికిందర్ (అంజాన్)తో అభిమానులను నిరాశ పరిచిన సూర్య.. 2015లో మాత్రం అలా జరగకుండా ఉండేందుకు సరికొత్త కథాంశాల నేపథ్యంలో సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే ‘మాస్’ సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా గడిపేస్తున్న సూర్య.. త్వరలోనే ‘హైకు’, ’24’ సినిమాల షూటింగుల్లో పాల్గొంటారు. తమిళంలో సరికొత్త కథాంశాలతో సినిమాలు తీసే దర్శకుడు వెంకట్ ప్రభు సూర్యతో చేస్తున్న సినిమాయే మాస్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 7కల్లా పూర్తవుతుంది. మాస్ షూటింగ్ పూర్తవ్వగానే.. మాస్ డబ్బింగ్‌ను, హైకు అనే సినిమాలోని కీలక పాత్రను పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు సూర్య. అమలా పాల్, బిందు మాధవి నటిస్తున్న హైకు సినిమాలో సూర్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇక మాస్ సినిమాను మే 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ రెండు సినిమాల తర్వాత.. ’13బీ’, ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల ద్వారా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ తెరకెక్కించనున్న ’24’ సినిమాలో సూర్య నటించనున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 27 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. డిసెంబర్‌లో ’24’ సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్‌లో నిర్మించనుండడం విశేషం. ఇవేకాక 2D ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య నిర్మిస్తున్న ఇతర చిత్రాలు కూడా 2015లోనే హల్‌చల్ చేయబోతున్నాయి.

తాజా వార్తలు