
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో మెరిసిన సిద్దార్థ్.. ఈ మధ్య కాలంలో తెలుగు తెరకు పూర్తిగా దూరమైపోయారు. సిద్దార్థ్ తెలుగులో చేసిన చివరి సినిమా.. ‘జబర్దస్త్’. ఆ సినిమా పరాజయం తర్వాత సిద్ధూ తెలుగులో మళ్ళీ సినిమా చేయలేదు. అయితే ఈ సమయంలో తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోయారు. తమిళంలో విడుదలై మంచి విజయం సాధించిన సినిమాలు కూడా తెలుగులో మాత్రం అంతంతమాత్రమే నడిచాయి. ఇక తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రాల తెలుగు వర్షన్ ప్రసక్తే ఎక్కడా వినిపించలేదు. ‘జిగర్‌తండా’ పేరుతో వచ్చి ఘన విజయం సాధించిన సిద్ధార్థ్ సినిమాను ‘చిక్కడు దొరకడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తారన్న ప్రచారం జరిగినా అది ఇప్పటివరకూ విడుదల కాలేదు.
తాజా సమాచారం మేరకు అదే సినిమాను ‘దిల్‌రాజు’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ‘దమ్ముంటే కాస్కో’ అన్నది ఈ సినిమాకి ట్యాగ్‌లైన్‌గా వినిపిస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా, సిద్ధార్థ్ హీరోగా నటించిన సినిమా ‘బొమ్మరిల్లు’ తర్వాతే సిద్ధూ తెలుగులో పాపులర్ అయ్యారు. ఇప్పుడు తనకు మంచి విజయాన్ని అందించిన ఆయన పేరు ఈ సినిమాకి పెట్టడం ఆసక్తికరంగా మారింది. అయితే.. సినిమా కథాంశాన్ని బట్టే ఆ పేరును ఖరారు చేశారని వినిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సినిమాను విడుదల చేసేవారే చెప్పాలి. పిజ్జా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంలో గత సంవత్సరం ఆగష్టు ఒకటిన విడుదల అయింది.

