
అల్లు అర్జున్ సినిమాకు గతంలో ఎన్నడూ లేనంత క్రేజ్ ‘S/O సత్యమూర్తి’ సినిమాకు ఉందంటే అతిశయోక్తి కాదు. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో ‘జులాయి’ వంటి సూపర్ హిట్ సినిమా రావడం, త్రివిక్రమ్ గత చిత్రం ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలవడం, ఇక అల్లు అర్జున్ గత చిత్రం ‘రేసుగుర్రం’ అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం వంటి కారణాల వల్ల సినిమాపై ఇటు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోను విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
ఈ అంచనాలకు తోడు ఇప్పటికే రిలీజైన ఆడియో, ట్రైలర్, పోస్టర్స్ ‘S/O సత్యమూర్తి’పై మరింత అంచనాలను పెంచాయి. ఇక భారీ అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 9) ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌తో పాటు హీరోయిన్లు సమంత, నిత్యామీనన్, అదా శర్మలు సినిమాకు ఆకర్షణ అనడంలో సందేహం లేదు.
గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులను నెలకొల్పింది. అత్యదిక థియేటర్లలో (సుమారు 1500 థియేటర్లలో) ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటివరకూ చెన్నైలో ఏ తెలుగు సినిమా విడుదల కానన్ని థియేటర్లలో ‘S/O సత్యమూర్తి’ విడుదల కానుండడం విశేషం. అలాగే అమెరికాలోనూ దాదాపుగా 150కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుండడం ఆసక్తికరంగా మారింది. మరి ఇన్ని అంచనాలను ‘S/O సత్యమూర్తి’ అందుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే!

