
‘నాకు బీపీ వస్తే ఏపీ, తెలంగాణ, బీహార్, కర్ణాటక ఇలా దేశం మొత్తం మండిపోద్ది..’, ‘రేసులో నన్ను అందుకోడానికి నేను రేసుగుర్రాన్ని కాదు.. రెడ్‌బుల్ తాగిన సింహాన్ని రా..’ అంటూ ‘సింగం123’ టీజర్‌లోని డైలాగులతో ఉర్రూతలూగిస్తున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్వరలోనే మరో సినిమాతో మన ముందుకు రానున్నాడు. ‘కొబ్బరి మట్ట’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియోను ఏప్రిల్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నారు. అదేంటీ? స్వాతంత్ర్య దినోత్సవం ఆగష్టు 15న కదా! అనుకుంటున్నారా? ఇది సంపూర్ణేష్ బాబు లెక్క మరి.
రూపక్ దర్శకత్వంలో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తోన్న ‘కొబ్బరిమట్ట’ పాటలను ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు సంపూర్ణేష్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలియజేశారు. ఈ పోస్ట్‌లో ఏప్రిల్ 15ను స్వాతంత్ర్య దినోత్సవంగా పేర్కొంటూ ఆడియో రిలీజ్ డేట్‌ను విడుదల చేశారు. ‘కొబ్బరిమట్ట’లో సంపూ క్యారెక్టర్ ఏ రేంజ్లో కామెడీ చేయనుందో ఈ ప్రకటన ద్వారానే నిరూపించారు. ఇక సంపూ మరో సినిమా ‘సింగం 123’ ట్రైలర్ ఇప్పటికే విడుదలై సంచలనం సృష్టిస్తోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ‘సింగం 123’ సినిమాను నిర్మిస్తున్నారు.

