సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన RRR తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అడ్వెంచరస్ డ్రామాను ఏప్రిల్ 7, 2027న అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ సినిమాతో సరికొత్త అంతర్జాతీయ మార్కెట్లను కొల్లగొట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా దేశాలలో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఇందులో ఉన్న ‘టైమ్ ట్రావెల్’ అంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇండియన్ సినిమా లిమిట్స్ దాటి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్టులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. విజయేంద్ర ప్రసాద్ అందించిన అద్భుతమైన కథకు, ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.


