బాహుబలి హిందీ ప్రెజెంటర్.. కరణ్ జోహరే!

బాహుబలి హిందీ ప్రెజెంటర్.. కరణ్ జోహరే!

Published on Apr 30, 2015 7:30 PM IST

karan-bahubali
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ దేశం ఎదురు చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలికి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను హిందీలో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేయడానికి ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఇదే విషయాన్ని కరణ్ జోహర్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కన్‌ఫర్మ్ చేశారు. “రాజమౌళి ఎంతో శ్రమతో తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ లాంటి సినిమాను హిందీలో విడుదల చేసే అవకాశం దక్కడం గర్వంగా భావిస్తున్నా” అంటూ కరణ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు రిప్లైగా, “కరణ్ జోహర్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్నిస్తోంది. బాహుబలిని ఆయన హిందీలో విడుదల చేయనుండడం సంతోషకరం” అని రాజమౌళి ట్వీట్ చేశారు.

కరణ్ జోహర్ లాంటి పేరున్న నిర్మాత బాహుబలిని హిందీలో విడుదల చేయనుండడం బాహుబలికి బాగా కలిసివచ్చే అంశం. హిందీ మార్కెట్‌పై ఆయనకున్న పట్టు బాహుబలి గ్రాండ్ రిలీజ్‌కు దోహదం చేస్తుంది. ఆ రకంగా బాహుబలి దేశవ్యాప్తంగా మారుమోగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మొదట్లో మే 15నే బాహుబలి మొదటి భాగాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించినా విజువల్ ఎఫెక్ట్స్‌ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండడంతో సినిమాను జూలై నెలకు పోస్ట్‌పోన్ చేశారు. మే 31న బాహుబలి ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించారు.

ఇక సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉండడంతో ఇంతకుముందెన్నడూ ఎరుగని రీతిలో బాహుబలికి ప్రమోషన్ కల్పించే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

తాజా వార్తలు