
ఒకప్పుడు తెలుగులో సూపర్ హిట్ సినిమాలు అందించిన హీరో సిద్ధార్థ్ ఆ తర్వాత కొన్నాళ్ళుగా తెలుగు తెరకు పూర్తిగా దూరమైపోయారు. తెలుగులో ఆయన చేసిన చివరి సినిమా జబర్దస్త్. ఆ సినిమా పరాజయం తర్వాత ఆయన తెలుగులో సినిమా చేయలేదు. అయితే ఇదే సమయంలో తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోయారు. అందులో కొన్ని తెలుగులోనూ విడుదలైనా పెద్దగా పేరు తెచ్చుకోలేదు. ఈమధ్య కాలంలో సిద్ధార్థ్ తమిళంలో ‘జిగర్ తండా’, ‘కావ్య తలైవన్’, ‘ఎనక్కుల్ ఒరువన్’ సినిమాలతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నారు.
ఇందులో ‘జిగర్తండా’, ‘ఎనక్కుల్ ఒరువన్’ సినిమాలు తెలుగులో ‘దిల్రాజు’, ‘నాలోఒకడు’ పేర్లతో విడుదల కానున్న విషయం తెలిసిందే! ‘నాలో ఒకడు’ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ మధ్యే హైద్రాబాద్లో జరిగింది. తెలుగు తెరకు కొన్నాళ్ళ పాటు దూరమైనందుకు సారీ చెబుతూ మళ్ళీ తనను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసే సినిమాగా ‘నాలో ఒకడు’ నిలుస్తుందని సిద్ధార్థ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా రేపు (మే 8న) విడుదలకు సిద్ధమైంది.

