
‘బాహుబలి’ ఆడియో రిలీజ్ ఈ నెల 31న జరగనుందని, ఆరోజే తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ కూడా విడుదల కానుందని ఆశ పడ్డ వారికి చేదు అనుభవమే మిగిలిన విషయం తెలిసిందే! మే 31న ఎంతో గ్రాండ్‌గా హైద్రాబాద్‌లోని హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున చేపట్టాలనుకున్న ఈ వేడుక చివరకు తలెత్తిన సెక్యూరిటీ ఇబ్బందులతో వాయిదా పడింది. దీంతో ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా అనే విషయంలోనూ క్లారిటీ లేకుండా పోయింది.
ఆడియో రిలీజ్ వాయిదా పడిన విషయాన్ని మీడియాకు తెలియజేసిన సందర్భంలోనూ ట్రైలర్ గురించి రాజమౌళి స్పష్టత ఇవ్వలేదు. అయితే తాజాగా రాజమౌళి, అభిమానులకు ఓ తీపి వార్తను అందించారు. ఈరోజు రాత్రి బాహుబలి ది బిగినింగ్‌కి సంబంధించిన 5 సెకన్ల టీజర్‌ను విడుదల చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించారు. ప్రభాస్, రానా అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కోసం యావత్‌దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే!

