ఇంటర్వ్యూ : పూరీ ఆకాష్ – నా కెరీర్‌కి ‘ఆంధ్రాపోరి’ తొలిమెట్టు!

ఇంటర్వ్యూ : పూరీ ఆకాష్ – నా కెరీర్‌కి ‘ఆంధ్రాపోరి’ తొలిమెట్టు!

Published on Jun 3, 2015 4:33 PM IST

Aakash-Puri

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాష్ ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో బాలనటుడిగా మంచి ప్రతిభ కనబరిచాడు. ‘ధోని’ సినిమా ద్వారా ప్రధాన పాత్రలోనూ మెప్పించిన ఆకాష్, తాజాగా ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రాజ్ మాదిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆంధ్రాపోరి’ అనే టీనేజ్ లవ్‌‍స్టోరీ ద్వారా పూర్తి స్థాయి హీరోగా పరిచయం కానున్నాడు. ఈ శుక్రవారమే (జూన్ 5న) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో పూరీ ఆకాష్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘ఆంధ్రాపోరి’ సినిమాతో హీరోగా ఎంట్రీ. ఎలా ఉంది?

స) చాలా కొత్తగా ఉంది. ఈ వయసులోనే హీరో అయిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. నిజానికి మరో ఆరేళ్ళ తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నా. అనుకోకుండా ఆంధ్రాపోరి సినిమా రావడం, ఈ సినిమాకు హీరో పదిహేడేళ్ళ టీనేజ్ కుర్రాడే కావాల్సి రావడం.. అన్నీ అలా కలిసొచ్చాయ్! ముందుగా దర్శకుడు రాజ్ మాదిరాజు గారు ఈ సినిమా కోసం సంప్రదించినప్పుడు భయపడ్డా. నేనిప్పుడు సినిమా చేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు నాన్న సలహా మేరకు హీరో అవ్వడానికి ముందుగా ఈ సినిమా చేస్తే నేనేంటో తెలుస్తుందనడంతో చేసేశా.

ప్రశ్న) సినిమా ఎలా వచ్చింది? మీ నాన్న గారు చూశారా?

స) సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటికే మూడు సార్లు చూశా. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే విధంగా, ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని తెరపై అందంగా చూసుకునేలా సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలను. నాన్న ఇంకా సినిమా చూడ్లేదు. ఆయన కొంత బిజీగా ఉండి చూడలేకపోయారు.

ప్రశ్న) ‘ఆంధ్రాపోరి’లో మీ రోల్ ఎలా ఉండబోతోంది?

స) ‘ఆంధ్రాపోరి’లో నా నిజ జీవితానికి భిన్నమైన పాత్ర పోషించా. ఈ సినిమాలో నిజామాబాద్ నర్సింగ్ అనే పాత్రలో కనిపిస్తా. హైపర్ యాక్టివ్, ఏదైనా డైరెక్ట్‌గా మాట్లాడేస్తాడు, అతడి మాటతీరులోనే మంచి ఫన్ ఉంటుంది. నర్సింగ్ పాత్రకు పూర్తి విరుద్ధమైన స్వభావం నాది. అందుకే ఈ పాత్ర కోసం దర్శకుడి దగ్గర్నుంచీ ఎన్నో ఇన్‌పుట్స్ తీసుకొని చాలెంజింగ్‌గా చేశా.

ప్రశ్న) నర్సింగ్ పాత్ర కోసం ఎలాంటి హోమ్‌వర్క్ చేశారు?

స) హోమ్‌వర్క్ అంటే చాలానే చేశాం. ఒక వర్క్‌షాప్‌లో పాల్గొన్నాక హీరో క్యారెక్టర్ ఎంటి? అతడెలా బిహేవ్ చేస్తాడు? అనేది ఐడియా వచ్చింది. ఇక తెలంగాణ యాసలో మాట్లాడం కోసం కొంత వర్క్ చేశా. అలా అన్నీ కుదిరాకే నర్సింగ్‌గా తెరపైకొచ్చా.

ప్రశ్న) హీరోగా మీ మొదటి సినిమాకే రీమేక్ కథను ఎంచుకున్నారెందుకు?

స) మరాఠీలో ఘన విజయం సాధించిన ‘టైమ్‌పాస్’ సినిమాకు రీమేక్ అయినా ఆ సినిమాకు, ఈ సినిమాకూ చాలా తేడా ఉంది. ఈ కథ నేనేమీ ఎంచుకోలేదు. ఈ సినిమాకు ఓ పదిహేడేళ్ళ కుర్రాడు హీరోగా కావాలి. ఆ కుర్రాడిని నేనయ్యాను. టైమ్‌పాస్ చూసిన తర్వాత నాకు ఫస్ట్‌లవ్‌లోని ఇన్నోసెన్స్ నచ్చింది. ఆ బేసిక్ పాయింట్ మీదే మన నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేశారు.

ప్రశ్న) దర్శకుడు రాజ్ మాదిరాజు, నిర్మాత రమేష్ ప్రసాద్‌ల గురించి చెప్పండి?

స) రాజ్ మాదిరాజు గారు చాలా కూల్ పర్సన్. ఎవరి దగ్గర్నుంచి ఏం కావాలో దాన్ని సరిగ్గా రాబట్టగలరు. ఓ రకంగా నా కెరీర్‌కిది ట్రైనింగ్ లాంటిది కూడా కావడంతో ఈ సినిమాతో యాక్టింగ్ పరంగా చాలా నేర్చుకున్నా. ఇక రమేష్ ప్రసాద్ గారు అంత గొప్ప స్థాయిలో ఉండి కూడా అందరితో చాలా చక్కగా మాట్లాడడం చూస్తే ఆశ్చర్యమేసింది. ప్రసాద్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థలో హీరోగా మొదటి సినిమా అవకాశం రావడం నా అదృష్టం.

ప్రశ్న) హీరోయిన్ ఉల్కా గుప్తా గురించి చెప్పండి?

స) ఉల్కా గుప్తా ఈ సినిమాలో నటించడానికంటే ముందే పెద్ద స్టార్. తను అద్భుతమైన నటి. ఉల్కా గుప్తాతో నటించడం నాకైతే ఓ కాంపిటీషన్ లాంటిదే! తను హైపర్ యాక్టివ్, తెలుగమ్మాయి కాకపోయినా ఇట్టే తెలుగు నేర్చేసుకుంది.

ప్రశ్న) ‘ఆంధ్రాపోరి’ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?

స) ఫస్ట్‌లవ్‌లో ఉండే ఇన్నోసెన్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్ అనుకుంటున్నా. ఈ కథతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఇక నర్సింగ్ పాత్ర నవ్విస్తూనే ఎవరికి వారు ఐడెంటిఫై చేసుకునేలా ఉంటుంది. పాటలు, లొకేషన్స్ మేజర్ ప్లస్‌పాయింట్స్.

ప్రశ్న) తదుపరి సినిమా ఏంటి? హీరోగానే కంటిన్యూ అయిపోతారా?

స) ఇప్పుడే ఏ సినిమా చేయదల్చుకోలేదు. మరో మూడేళ్ళ తర్వాత హీరోగా మళ్ళీ ఎంట్రీ ఇస్తా. ఈలోపు బ్యాంకాక్‌లో ఫైట్స్ నేర్చుకొని ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్స్ చేయాలనుకుంటున్నా. అవన్నీ పూర్తయ్యాక నాన్న దర్శకత్వంలో ఫుల్ ప్లెడ్జ్ హీరోగా మరోసారి ఎంట్రీ ఇస్తా. ‘ఆంధ్రాపోరి’ హీరోగా నేను మొదలుపెట్టే కెరీర్‌కి మొదటి మెట్టుగా భావిస్తున్నా.

తాజా వార్తలు