
భారతీయ సినీ పరిశ్రమలో జాతీయ అవార్డుల తర్వాత ఆ స్థాయి పేరున్నది ఫిల్మ్‌ఫేర్ అవార్డులకే! హిందీ, తెలుగు, తమిళం, కన్నడం మళయాలం ఇలా ఒక్కో భాష సినిమాలకు విడివిడిగా ఈ అవార్డులను నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే. 2014లో విడుదలైన హిందీ సినిమాలకు సంబంధించిన అవార్డులను ఇప్పటికే ప్రదానం చేయగా వచ్చే నెలలో సౌతిండియాలోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులను ప్రకటించనున్నారు. ఇక ఒక్కో క్యాటగిరీలో అవార్డులకు సంబంధించి నామినేషన్లను నిన్నే ప్రకటించారు.
తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఉత్తమ చిత్రం క్యాటగిరీలో ‘దృశ్యం’, ‘మనం’, ‘రేసుగుర్రం’, ‘రన్ రాజా రన్’, ‘కార్తికేయ’ సినిమాలు పోటీలో ఉన్నాయి. ఇక ఉత్తమ నటి క్యాటగిరీలో కాజల్, పూజా హెగ్దే, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, శృతి హాసన్‌లు ఉన్నారు. ఉత్తమ దర్శకుడు క్యాటగిరీలో చందూ మొండేటి, శ్రీ ప్రియ, సుజీత్, సురేందర్ రెడ్డి, విక్రమ్ కుమార్‌లు ఉన్నారు.
ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి వస్తుందా అని అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ క్యాటగిరీలో నామినేషన్లను తాజాగా ప్రకటించారు. ఉత్తమ నటుడు అవార్డు కోసం అల్లు అర్జున్ (రేసు గుర్రం), మోహన్ బాబు (రౌడీ), నాగార్జున (మనం), శర్వానంద్ (రన్ రాజా రన్), వెంకటేష్ (దృశ్యం) పోటీ పడుతున్నారు. ఇక అదే ఏడాది విడుదలైన మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమా అవార్డుల రేసులో దూసుకుపోతుందని భావించిన అభిమానులకు 62వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు చేదు అనుభవాన్నే మిగిల్చనున్నాయి.

