ఇప్పటి వరకూ టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని ఒక్కసారిగా ఇండియా మొత్తానికి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. అత్యంత భారీ బడ్జెట్ తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి పార్ట్ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనులో భాగంగా ప్రభాస్ ఇండియా మొత్తం తిరుగుతూ అన్ని చోట్లా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ బాహుబలి సినిమా గురించి, తన కెరీర్ గురించి పలు విషయాలను తెలియజేశాడు.
బాహుబలి సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. మరి ఇకపై బాలీవుడ్ సినిమాలు చేస్తారా అని ప్రభాస్ ని అడిగితే ‘నేను బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఎప్పుడు సిద్దంగానే ఉన్నాను. కచ్చితంగా మంచి స్క్రిప్ట్ రాగానే బాలీవుడ్ లో సినిమా చేస్తానని’ అన్నాడు. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న బాహుబలి సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. ప్రభాస్ తో పాటు రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.


