
తన సహజమైన నటనతో, మంచి టైమింగ్ ఉన్న డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కట్టిపడేసిన యువహీరో.. నాని. గత కొంతకాలంగా తనను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసే హిట్ కోసం ఎదురుచూసిన నాని, ఈమధ్యే విడుదలైన ‘జెండాపై కపిరాజు’, ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాల ద్వారా మంచి కమర్షియల్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో నాని వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఇప్పటికే దర్శకుడు మారుతితో భలే భలే మగాడివోయ్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన నాని, తాజాగా మరో సినిమా షూటింగ్‌కు షిఫ్ట్ అయిపోయాడు.
‘అందాల రాక్షసి’ సినిమాతో ఓ అందమైన ప్రేమకథను అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ చిత్రాల సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం అనంతపూర్‌లోని ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సోమవారం రోజున మొదలైన ఈ షెడ్యూల్ మరికొన్ని రోజులు ఇక్కడే జరగనుందని తెలుస్తోంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

