ఇప్పుడు ఏ నోట విన్నా, ఏ చోట కన్నా అంతటా ‘బాహుబలి’ ఫీవర్ పట్టేసుకుంది. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే! ఇక ఈ ఉదయం నుంచే ప్రధాన థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో టికెట్ బుకింగ్‌ను మొదలుపెట్టేశారు. ఆన్లైన్లో నిమిషం కూడా టికెట్లు అందుబాటులో లేకుండా అమ్ముడైపోవడం సంచలనమైతే, మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా బుకింగ్స్ కోసం అభిమానులు భారీ సంఖ్యంలో హాజరు కావడం విశేషంగా కనిపిస్తోంది.
హైద్రాబాద్‌తో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లోని మల్టిప్లెక్సుల్లో ఈ ఉదయమే టికెట్ల బుకింగ్ మొదలుకాగా, బుకింగ్ కౌంటర్ల వద్ద అభిమానులు బారులు తీరి కనిపించారు. కొన్నిచోట్ల ఏకంగా కిలోమీటర్ మేర క్యూ ఉండడం బాహుబలి క్రేజ్‌కు నిదర్శనం. తెలుగుతో పాటు తమిళం, మళయాలం, హిందీ భాషల్లోనూ జూలై 10నే విడుదల కానున్న ఈ సినిమా, దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావడం, ట్రైలర్, పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేయడంతో అంతటా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సినిమా రిలీజ్ కంటే ముందు రోజు అంటే గురువారం అర్థరాత్రి ప్రదర్శితమయ్యే బెనిఫిట్ షోలకు కనీవినీ ఎరుగని రీతిలో టిక్కెట్ ధరలు ఉండడం చూడొచ్చు. మరి ఇన్ని అంచనాల మధ్య రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందనేది వేచి చూడాలి.


