
ఇప్పుడు ఏ నోట విన్నా, ఏ చోట కన్నా అంతటా ‘బాహుబలి’ ఫీవర్ పట్టేసుకుంది. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే! ఇక ఈ సాయంత్రం నుంచే అన్ని చోట్లా బాహుబలి హంగామా మొదలైంది. ముందుగా అర్ధరాత్రి 12గంటల తర్వాత బాహుబలి బెనిఫిట్ షోస్ మొదలుకానున్నాయి.
ఇదిలా ఉంటే.. తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాకు తమిళ నాట కూడా భారీ క్రేజ్ ఉంది. తమిళ నాట బాహుబలి సినిమా సుమారు 400 థియేటర్లలో విడుదల కానుంది. ఇక తమిళ పెద్ద హీరోల సినిమాలకు వేసినట్లుగా ఈ సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి టికెట్ దొరకడమనేది దాదాపు అసాధ్యంగా తయారైంది. ఇప్పటికే అన్ని చోట్లా మూడు రోజుల వరకు టికెట్లు బుక్ అయిపోవడం విశేషంగా కనిపిస్తోంది.

