
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రానా దగ్గుబాటి విలన్ గా సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా గత 5 రోజులుగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల బాక్స్ ఆఫీసులని షేక్ చేస్తోంది. ప్రతి భాషలోనూ రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తోంది. తాజాగా కేరళలో కూడా పాత రికార్డ్ లని బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. కేరళలో మొదటి రోజు చాలా తక్కువ థియేటర్స్ లో బాహుబలిని ప్రదర్శించినప్పటికీ రెండవ రోజు సాయంత్రానికల్లా 300 థియేటర్స్ లో బాహుబలి షోస్ రన్ అయ్యాయి. దాంతో కలెక్షన్స్ ఊపందుకోవడంతో తెలుగు డబ్బింగ్ సినిమా ఓల్డ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టింది.
లేటెస్ట్ గా అందిన ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం సోమవారం వరకూ కలుపుకొని అనగా మొదటి నాలుగు రోజుల్లో కలుపుకొని బాహుబలి సినిమా కేరళలో 2.65కోట్ల షేర్ ని సాధించింది. ఇప్పటి వరకూ మలయాళంలో టోటల్ లాంగ్ రన్ లో 2.5కోట్ల షేర్ సాధించిన సినిమా ‘లక్కీ – ది రేసర్’. ఇది తెలుగులో వచ్చిన రేసు గుర్రం సినిమాకి డబ్బింగ్ వెర్షన్. ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ ని బాహుబలి క్రాస్ చేసి కొత్త రికార్డ్ ని సృష్టించింది. అంతే కాకుండా ఓవరాల్ గా బాహుబలి కేరళలో 5 నుంచి 6 కోట్ల షేర్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క కేరళలోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా బాహుబలి రికార్డ్స్ సృష్టిస్తోంది.

