
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సినిమా అంటేనే సున్నితమైన భావోద్వేగాలకు పెట్టిన పేరు. ఎప్పటికప్పుడు సెన్సిబుల్ సినిమాలను నిర్మిస్తూ తన సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు దిల్‌రాజు. ఓవైపు తనదైన శైలిలో భారీ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్న సినిమాలను కూడా చేస్తూ మెప్పించే ఈ నిర్మాత త్వరలోనే ఎన్టీఆర్‌తో మూడోసారి పనిచేసేందుకు సిద్ధమైపోయారు. గతంలో దిల్‌రాజు-ఎన్టీఆర్ కాంబోలో ‘బృందావనం’, ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలు రూపొందిన విషయం తెలిసిందే!
‘బృందావనం’ సూపర్ హిట్‌గా నిలవగా, ‘రామయ్యా వస్తావయ్యా’ ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్‌తో మళ్ళీ మంచి హిట్ కొట్టాలన్న ఆలోచనలో దిల్‌రాజు కొత్త సినిమాకు శ్రీకారం చుట్టనున్నారు. జనవరి నెలలో ఎన్టీఆర్‌తో సినిమా మొదలుపెట్టనున్నామని దిల్‌రాజు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సుకుమార్ సినిమాలో హీరోగా నటిస్తుండగా, ఆ సినిమా పూర్తి కాగానే దిల్‌రాజు సినిమాను స్టార్ట్ చేస్తారు. ఈ సినిమాకు ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్-కొరటాల శివల కాంబినేషన్ ఎప్పట్నుంచో వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

