
కామెడీ కింగ్ అల్లరి నరేష్ సినిమా అనగానే ప్రేక్షకులకి గుర్తొచ్చేది ఒక్కటే.. రెండున్నర గంటలపాటు కడుపుబ్బా నవ్వుకునే కామెడీ ఉంటుందని నమ్ముతారు. అల్లరోడు చేసిన మరో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ‘జేమ్స్ బాండ్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. జూలై 24న ‘జేమ్స్ బాండ్’ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) ‘అల్లరి ఈజ్ బ్యాక్’ అంటూ ‘జేమ్స్ బాండ్’తో వస్తున్నారు.. సినిమా కూడా ‘అల్లరి ఈజ్ బ్యాక్’ అనుకునేలా ఉంటుందా.?
స) ప్రేక్షకులు నా దగ్గర్నుంచి ఎలాంటి సినిమా అయితే కోరుకుంటున్నారో సరిగ్గా అలాంటిదే ఈ ‘జేమ్స్ బాండ్’. ‘అల్లరి ఈజ్ బ్యాక్’ అని కూడా ఈ సినిమా విషయంలో చెబుతూ వస్తున్నారు. ‘జేమ్స్ బాండ్’ కచ్చితంగా ఆ ట్యాగ్‌లైన్‌ను నిజం చేస్తుందన్న నమ్మకం ఉంది. ‘సుడిగాడు’ తర్వాత నా దగ్గర్నుంచి ఎక్కువగా అలాంటి సినిమాలనే కోరుతూ వచ్చారు. నా గత సినిమాల్లో మిస్ అయ్యాయన్న అంశాలన్నీ జేమ్స్ బాండ్లో కనిపిస్తాయి.
ప్రశ్న) టైటిల్ చూస్తుంటే.. హీరోయిన్ డామినేషన్ ఉన్న సినిమాగా కనిపిస్తోంది. దీనిపై మీరేమంటారు?
స) అలాంటిదేమీ లేదు. నా వరకూ నేను హీరో డామినేటెడ్ స్టోరీయా.? కాదా.? అన్న విషయాలను పట్టించుకోను. హీరో అయినా, హీరోయిన్ అయినా కథకు తగ్గ పాత్రలుగా మాత్రమే గుర్తించబడాలి. నేనైతే ఈ సినిమాలో హీరో, హీరోయిన్లను రెండు ప్రధాన పాత్రలుగా చెబుతా. ఈ కథలో అద్భుతమైన ఫన్ ఉంది. హీరో పాత్ర చుట్టూనే సినిమా నడుస్తుంది. ఎవరు ఎవర్ని డామినేట్ చేస్తారన్న ప్రశ్నే లేదు.
ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
స) ఈ సినిమాలో నేను నాని అనే ఓ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌గా కనిపిస్తా. సాధారణ మధ్య తరగతి ఆలోచనల మధ్యన బతికే అతడి జీవితంలోకి ఓ లేడీ డాన్ రాకతో ఎలాంటి మార్పులొచ్చాయన్నదే ఈ సినిమా కథ. కథ వినగానే ఈ పాత్రలో నాకు మంచి కామెడీ టచ్ కనిపించింది. సినిమాలో కూడా ఆ ఎలిమెంట్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది.
ప్రశ్న) దర్శకుడికిది మొదటి సినిమా. ఎప్పుడైనా రిస్క్ చేస్తున్నామని అనిపించిందా?
స) లేదు. దర్శకుడు సాయి కిషోర్‌కి ఇది మొదటి సినిమా అయినా ఎక్కడా ఆ భావన కనిపించదు. కామెడీ సినిమా చేయడమనేది ఏ దర్శకుడికైనా కష్టమైన పనే.! అయితే కిషోర్ చాలాకాలం శ్రీను వైట్ల గారి దగ్గర పనిచేశారు. ఆ కామెడీ ఫ్లేవర్ సాయికి బాగా తెలుసు. స్వతహాగా కూడా కామెడీని బాగా ఇష్టపడే వ్యక్తి కావడంతో ఈ సినిమాను కొత్త దర్శకుడిలా అయితే చేయలేదు.
ప్రశ్న) హీరోయిన్ సాక్షి చౌదరి గురించి చెప్పండి?
స) హీరోయిన్ పాత్ర ఇందులో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఓ డాన్ పాత్రలో హీరోయిన్ కనిపించాలంటే చూడడానికి నమ్మేలా ఉండాలి. అందుకు తగ్గట్టుగానే సాక్షి 5’9” ఉండి, డాన్ పాత్రకు సరిగ్గా సరిపోయేలా ఉంది. మేము ఊహించిన దానికంటే బాగా నటించింది.
ప్రశ్న) ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?
స) ఈ సినిమాకు మేజర్ హైలైట్ అంటే కామెడీయే. నా సినిమా అంటే సాధారణంగా ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది.
ప్రశ్న) మీ నాన్నగారు మీ కెరీర్‌కి బూస్ట్ అప్ ఇచ్చే సినిమాలు ఎన్నో తీశారు. ఆయన లేని లోటు కనిపిస్తుందా?
స) నాన్నగారు లేని లోటంటే.. తప్పకుండా ఉంటుంది. సినిమాల పరంగా చూసుకుంటే.. నా సినిమాల విషయంలో ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆ లోటు పెద్దగా కనిపించదు. పర్సనల్‌గా మాత్రం ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది.
ప్రశ్న) మీ నాన్నగారి పేరుతో స్థాపితమైన ఈవీవీ బ్యానర్‌పై మళ్ళీ సినిమా ఎప్పుడు ఉంటుంది?
స) ఈవీవీ బ్యానర్‌పై త్వరలోనే మళ్ళీ ఓ సినిమా ఉంటుంది. లాస్ట్ టైమ్ ‘బందిపోటు’ అంటూ క్లాస్ కామెడీతో వచ్చి కొంత నిరాశపరిచా. అయితే మళ్ళీ బ్యానర్ పేరును నిలబెట్టే సినిమా ఒకటి తప్పకుండా చేస్తా. వేరే హీరోలతో కూడా మా బ్యానర్‌పై సినిమా చేయాలనుంది.
ప్రశ్న) ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు?
స) ప్రస్తుతం మోహన్ బాబు గారితో కలిసి ‘మామ మంచు – అల్లుడు కంచు’ అన్న సినిమా ఓకే అయింది. సెప్టెంబర్‌లో ఆ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. ఇదేకాక మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నా సినిమాల సంఖ్య తగ్గింది. ఇకపై ఎప్పట్లానే మూడు నెలలకో సినిమా ఉండేలా చూసుకుంటా.

