
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే, తమిళం కూడా చాలా బాగా మాట్లడగలడు. కానీ ఇప్పటి వరకూ డైరెక్ట్ గా ఒక్క తమిళ సినిమా కూడా చేయలేదు. అలాగే ఒక్కసారి కూడా తెలుగుతో పాటు తమిళంలో తన సినిమాని డబ్ చేసి కూడా రిలీజ్ చేయలేదు. ఇకపై తమిళంలో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సారి ‘శ్రీమంతుడు’ని మాత్రం ‘సెల్వందన్’ పేరుతో తమిళంలో కూడా ఆగష్టు 7నే గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే తమిళంలో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
శ్రీమంతుడుని డబ్బింగ్ మాత్రమే చేస్తున్నారు.. కానీ మహేష్ బాబు తన తదుపరి సినిమాని ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో షూట్ చేసి, ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో మహేష్ బాబు చేయనున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమాలో రెండు భాషల వారికి సరిపోయే కంటెంట్ ఉండడం వలన ఈ చిత్ర టీం ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో షూట్ చేయనున్నారు. 2016 సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మహేష్ బాబు సరసన తెలుగు, తమిళ భాషల్లో బాగా ఫేమస్ ఉన్న సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా నటించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని పివిపి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. జూలై చివరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

