
షాపింగ్ మాల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగువారి మదిలో నిలిచిపోయిన హీరోయిన్ అంజలి. అంజలి హీరోయిన్ గా పలు తెలుగు, తమిళ సినిమాలలో బిజీగా ఉంటూనే మధ్య మధ్యలో పలు సినిమాల్లో అతిధి పాత్రల్లో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా అంజలి నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్ రామ్ దర్శకత్వంలో రానున్న ‘తారామణి’ సినిమాలో ఓ అతిధి పాత్రలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రామ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ‘కత్రాదు తమిజ్’ సినిమాలో అంజలి హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా నుంచి ఉన్న సత్సంబంధాల వలన అంజలి ఈ సినిమా చేయడానికి అంగీకరించింది. రామ్ చేసిన రెండవ సినిమా తంగ మీంగల్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ 3వ సినిమాలో ఆండ్రియా జెరేమియా మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఎమోషనల్ డ్రామాలను చాలా బాగా తీసే రామ్ ఈ సారి కూడా సూపర్బ్ ఎమోషన్స్ తో ఈ సినిమాని తీస్తున్నాడు. అంజలి ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’ సినిమాలో నటిస్తోంది.

