
తమిళ సూపర్ స్టార్ సూర్య, విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ’24’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సమంత కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ముంబై నేపథ్యంలో నడిచే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు హీరోయిన్ నిత్యామీనన్‌ను సంప్రదించారట. కథలో తన పాత్ర ప్రాధాన్యత కలిగినది కావడంతో నిత్యా మీనన్ కూడా ఓకే చేసేశారని తెలుస్తోంది.
‘ఓకే బంగారం’, ‘కాంచన 2’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’.. ఇలా వరుస సినిమాలతో మెప్పిస్తోన్న నిత్యా మీనన్, సూర్య సినిమా అవకాశం సొంతం చేసుకోవడం ఆసక్తిరంగా కనిపిస్తోంది. ’13బీ’, ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల ద్వారా సరికొత్త కథాంశాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు విక్రమ్ కుమార్ ’24’ సినిమాను ఓ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో డిసెంబర్ నెల్లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ’24’ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

