
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘శ్రీమంతుడు’ సినిమా రిలీజ్ కావడానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా ఆగష్టు 7న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యిందని, ఈ రోజు ఉదయం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుందని ఇది వరకే తెలియజేశాం. చెప్పిన దాని ప్రకారం ఈ రోజు ఉదయం సెన్సార్ వారు ఈ సినిమాని చూసారు. సెన్సార్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ వారు ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. నిర్మాతలు ముందుగా భావించినట్లే ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ రావడంతో వారు చాలా హ్యాపీగా ఉన్నారు..
సెన్సార్ వారు ఈ సినిమాకి యు/ఏ ఇవ్వడమే కాకుండా ఒక సోషల్ మెసేజ్ కంటెంట్ ని కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పిన తీరుని స్పెషల్ గా మెచ్చుకోవడం నిర్మాతలకి మరింత ఆనందాన్ని ఇచ్చింది. రిలీజ్ దగ్గర పడుతుండడంతో మహేష్ బాబు, హీరోయిన్ శృతి హాసన్ మరియు మిగిలిన టీం జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఓ సోషల్ మెసేజ్ ని కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పిన ఈ సినిమా విషయంలో ఎక్కడా లైట్ తీసుకోకుండా ఈ చిత్ర ప్రొడక్షన్ టీం తెలుగు, తమిళ భాషల్లో బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ తమిళ్లో కూడా తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నంగా తమిళంలో ‘సెల్వందన్’ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు తమిళ వెర్షన్ ఆడియోని ఆగష్టు 4న చెన్నైలో రిలీజ్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

