
మహేష్ హిమ మూవీస్ పతాకంపై మహేష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘కలయా నిజమా’. పెళ్ళి తర్వాత భార్య భర్తల మధ్యన తలెత్తే గొడవలు ఎటువైపు దారిస్తాయనే అంశాన్ని ఓ సరికొత్త ప్రయోగంతో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు మహేష్. రాజ్, భగత్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రేపు (ఆగష్టు 7న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మహేష్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) ముందుగా మీ నేపథ్యమేంటి? సినిమాల్లోకి ఎలా వచ్చారు?
స) నేను ఉద్యోగ రీత్యా ఆర్కిటెక్ట్‌ని. మొదట్నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. ప్యాషన్‌తో సరికొత్త ప్రయోగాలు, మంచి సినిమాలు తీసి సినీ పరిశ్రమలో మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది. ఆ క్రమంలోనే కొన్ని షార్ట్‌ఫిల్మ్స్ చేశా. సినిమాపై నాకంటూ ఓ అవగాహన వచ్చాక ‘కలయా నిజమా’ అంటూ ఈ సినిమా చేశా. నా మొదటి సినిమాయే సరికొత్త ప్రయోగం కావడం సంతోషంగా ఉంది.
ప్రశ్న) ‘కలయా నిజమా’ గురించి చెప్పండి? మీరే నిర్మాతగా ఈ సినిమా తీయడానికి కారణం?
స) ‘కలయా నిజమా’ అనే కథ అనుకున్నపుడే దీన్ని నేనే స్వయంగా తీయాలని అనుకున్నా. వేరే నిర్మాతలు ఈ కథను ఇలాగే నమ్మి నాకు అవకాశం ఇచ్చి ఓ ప్రయోగానికి ఓకే చెబుతారనుకోలేదు. అందుకే స్వయంగా నేనే ఈ సినిమాను నిర్మించా. ఈ మధ్య కాలంలో పెళ్ళి తర్వాత భార్యా భర్తల మధ్య వచ్చే గొడవలను పెద్దవిగా చేసుకొని ఆ బంధాన్ని తెంపుకునేవరకూ వెళుతున్నారు. ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే వచ్చాయి. నేను ఈ సినిమాలో బంధంలో ఏర్పడే గొడవల ద్వారా వచ్చే ధ్వేషాన్ని ఓ దెయ్యం తరహా రూపంలో చూపిస్తున్నా. ఈ పార్ట్ కోసం మంచి గ్రాఫిక్స్ వర్క్ చేశాం. ఒక మెసేజ్‌నే మంచి ప్రయోగంతో చెబుతున్నాం.
ప్రశ్న) మీకు గతంలో సినిమా అనుభవం లేదు. ఈ సినిమాను మీరే స్వయంగా నిర్మించారు. ఇబ్బంది పడలేదా?
స) చిన్న చిన్న ప్రొడక్షన్ ఇబ్బందులు తప్పితే సినిమా మొత్తం సాఫీగా జరిగిపోయింది. నేను ఈ సినిమా కోసం ఇండస్ట్రీలో చాలా సినిమాలకు పనిచేసిన అనుభవం ఉన్న టెక్నీషియన్స్‌ను తీసుకున్నా. దీంతో సినిమా పరంగా ఎక్కడా ఇబ్బంది పడలేదు. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ ఇలా అందరూ మంచి సలహాలచ్చి సినిమాను నడిపించారు.
ప్రశ్న) హీరో, హీరోయిన్లు ఇద్దరినీ కొత్తవారినే తీసుకున్నారు. కారణం?
స) ఈ కథకు కొత్తవారైతేనే మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం. అందుకే కొత్తవారినే ఎంపిక చేశాం. హీరో రాజ్, హీరోయిన్ గీతా భగత్‌లను ఈ సినిమా కోసం ఆడిషన్ పెట్టి సెలెక్ట్ చేశాం. గీతా భగత్ గతంలో పలు టీవీ షోలు చేశారు. ఇద్దరూ నేననుకున్న దానికంటే బాగా చేశారు. వారి నటన కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది.
ప్రశ్న) శ్రీమంతుడు లాంటి పెద్ద సినిమా విడుదల రోజు వస్తున్నారు. రిస్క్ అనిపించలేదా?
స) అలా ఏమీ లేదు. మేము అందరం ఆలోచించుకున్నాకే ఇదే సినిమా రిలీజ్‌కు సరైన సమయం అనుకున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆగష్టు 7 రిలీజ్‌కే సిద్ధమవడంతో అలాగే ఫిక్స్ అయ్యాం. ఈ సినిమా ఓ ప్రత్యేక జానర్ సినిమా. ఇలాంటి సినిమాను కోరుకునేవారికిది కచ్చితంగా నచ్చుతుంది.
ప్రశ్న) ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి? ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
స) ఈ సినిమాకు మేజర్ హైలైట్ అంటే.. ప్రయోగాత్మక అంశమనే చెప్తా. ఇంతకుముందు విన్న కథాంశాన్నే ఈ సినిమాలో కొత్తగా ప్రెజెంట్ చేశా. అదే ఈ సినిమా ప్రత్యేకత. గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్.. ఇలా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది.
ప్రశ్న) తరువాతి సినిమా ఏంటి? ఏదైనా ప్లాన్ చేస్తున్నారా?
స) ఇంకా ఏమీ అనుకోలేదు. రేపు ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది తెలిశాక రెండో సినిమా ప్లాన్ చేస్తా.

