
‘ఉయ్యాల జంపాల’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన యువహీరో రాజ్ తరుణ్, తన రెండో సినిమా కోసం ఎన్నో కథలు విని చివరకు ‘సినిమా చూపిస్త మామ’ అంటూ ఇప్పటికి రెండో సినిమాను సిద్ధం చేశారు. ‘ఉయ్యాల జంపాల’ లాంటి అందమైన ప్రేమకథలో ఒదిగిపోయిన రాజ్ తరుణ్ – అవికా గోర్ జంట ఈ సినిమా ద్వారా మరోసారి మెప్పించనున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. దాదాపుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేసేందుకు ముందుకు రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయ్!
దిల్‌రాజు తమ సినిమాను కొనుగోలు చేయడంతో సినిమా రేంజ్ పెరిగిందని, ఆగష్టు 14న సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. “ఎంతో కష్టపడి చాలా నమ్మకంతో ఈ సినిమా చేశాం. నా మొదటి సినిమా తర్వాత మంచి కథ కోసమే చాన్నాళ్ళు ఎదురుచూశా. రిలీజ్‌కి దగ్గరపడుతుండడంతో టెన్షన్ పెరిగిపోతూ ఉండేది. ఎప్పుడైతే దిల్‌రాజు గారు ఈ సినిమా చూసి, విడుదల చేయడానికి ఒప్పుకున్నారో అప్పట్నుంచి నాకు మరింత నమ్మకం కలిగింది. ఆయన సినిమాను కొనుగోలు చేశారంటే అది బ్రాండ్ లాంటిది. కచ్చితంగా దీంతో సినిమా రీచ్ పెరుగుతుందని, అందరినీ అలరించే సినిమాగా సినిమా చూపిస్త మావా నిలుస్తుందని కోరుకుంటున్నా” అని తెలిపారు.

