
సినీ పరిశ్రమలో హీరోగా మంచి పేరు సంపాదించుకున్న ఒక స్టార్ సినిమా మూడేళ్ళ పాటు ఆర్థిక పరమైన కేసులతో విడుదలకు నోచుకోలేదు. ఈ సమయంలో ఆ స్టార్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అలాంటి హీరో పరిస్థితి ఎలా ఉంటుంది? తమిళంతో పాటు తెలుగులోనూ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శింబు కొన్నాళ్ళుగా ఈ పరిస్థితులతోనే కొట్టుమిట్టాడాడు. శింబును అంతలా ఆందోళన పరచిన ఆ సినిమా ‘వాలు’. విజయ్ చందర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఈ సినిమాలో హన్సిక హీరోయిన్గా నటించింది.
చాన్నాళ్ళ క్రితమే అన్ని కార్యక్రమలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థతో కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తి కోర్టు ముందు ఆగిపోయింది. ఈ గ్యాప్లో చాలా సార్లే ఈ సినిమా విడుదలవుతుందన్న ప్రచారం జరిగినా అవేవీ జరగలేదు. కాగా ఈమధ్యే ఆ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సినిమాపై వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకోవడంతో సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఇక ఈ ఉదయమే కోర్టు నుంచి ఈ విషయమై అధికారిక ఉత్తర్వులు వచ్చాయి. దీంతో శింబు అభిమానులే కాక సినీ పరిశ్రమ ప్రముఖులు సైతం ఆనందం వ్యక్తం చేశారు. అన్ని ఇబ్బందులనుంచి ఎట్టకేలకు బయటపడ్డ ఈ సినిమా ఆగష్టు 14న పెద్ద ఎత్తున విడుదల కానుంది.

