
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘శ్రీమంతుడు’ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. ఇక అంతా అనుకున్నట్లుగానే మొదటిరోజు ఈ సినిమా అన్ని చోట్లా కలెక్షన్లు కుమ్మేసింది. ఇక తమ సినిమాకు మంచి హిట్ టాక్ రావడంతో పాటు, భారీ కలెక్షన్లు కూడా రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సినిమా యూనిట్ నేడు హైద్రాబాద్‌లో ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సినిమా నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ఫస్ట్‌డే ‘శ్రీమంతుడు’ సినిమా ప్రప్రంచవ్యాప్తంగా సుమారు 30.14 కోట్ల షేర్ సాధించిందని తెలిపారు.
ఇక ఇదే సమావేశంలో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. “సినిమా యూనానిమస్ టాక్ తో పెద్ద హిట్ అయింది. మొదటి రోజు నుండి అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి సక్సెస్ టాక్ సంపాదించుకుంది. సినిమా అనుకున్న దాని కంటే పెద్ద సక్సెస్ అయింది. ఈ విజయంలో అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ పార్ట్ గా ఉన్నందుకు అందరికీ థాంక్స్. ఇటువంటి సినిమాని చేయడానికి అంగీకరించిన మహేష్ బాబుగారికి స్పెషల్ థాంక్స్. ఈ విజయంతో ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా మరిచిపోయాను” అని తెలిపారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మట్లాడుతూ.. ‘‘మా బ్యానర్లో వచ్చిన మొదటి సినిమా శ్రీమంతుడు. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నటీనటులు, టెక్నిషియన్స్‌కి థాంక్స్. పైరసీని ఎంకరేజ్ చేయవద్దు. సినిమా యూనానిమస్ టాక్‌తో ముందుకెళుతుంది. మంచి కలెక్షన్స్ వస్తుంది. అన్నీ చోట్ల మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి రవిశంకర్, మోహన్(సి.వి.ఎం) తదితరులు పాల్గొన్నారు.

