
విక్టరీ వెంకటేష్ కి ‘ప్రేమించుకుందాం రా’ అనే సూపర్ హిట్ ఫిల్మ్ ఇచ్చి డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత చిరంజీవికి ‘బావగారు బాగున్నారా’, ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’, ప్రభాస్ కి ‘ఈశ్వర్’, నాగార్జునకి ‘రావోయి చందమామ’, నందమూరి బాలకృష్ణకి ‘లక్ష్మీ నరసింహా’ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ. ఈయన చేసిన చివరి తెలుగు సినిమా ‘తీన్ మార్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో ఆయన సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు.
దాదాపు నాలుగేళ్ళు గ్యాప్ తీసుకున్న జయంత్ సి పరాన్జీ ఐ యామ్ బ్యాక్ అంటూ మళ్ళీ ఓ కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రొటీన్ సినిమాలతో బోర్ కొట్టేసిన జయంత్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. జయంత్ తెలిపిన సమాచారం ప్రకారం ‘సొసైటీలో జరుగుతున్న మానవ అక్రమ రవాణా(హ్యుమన్ ట్రాఫికింగ్), పిల్ల వ్యభిచారం మీద సస్పెండ్ అయిన ఓ పోలీస్ ఆఫీసర్ చేసిన పోరాటాన్నే ఇందులో చూపించనున్నాను. సినిమాలో ప్రేమ, రొమాన్స్ మరియు సాంగ్స్ లాంటివి ఏమీ ఉండవు. సినిమాని చాలా రియలిస్టిక్ గా షూట్ చేయనున్నానని’ జయంత్ తెలిపాడు. త్వరలోనే ఈ సినిమా నటీనటుల గురించి అనౌన్స్ చేయనున్నాడు.

