రాజమౌళిని కదిలించిన ప్రశంస..!

రాజమౌళిని కదిలించిన ప్రశంస..!

Published on Aug 11, 2015 4:53 PM IST

rajmouli
రాజమౌళి.. గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా మారు మోగిపోతోన్న పేరు. ‘బాహుబలి’ సినిమాతో ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చాడన్న ప్రశంసలతో పాటు, బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టించిన ఈ దర్శక ధీరుడి విజన్‌ను అంతర్జాతీయ పత్రికలు సైతం కొనియాడాయి. ఇక సినిమా విడుదల రోజునుంచే ప్రశంసల వర్షంలో మునిగి తెలుతోన్న రాజమౌళి, అన్ని ప్రశంసల్లోకెల్లా కవి వైరముత్తు బాహుబలి విషయంలో అందించిన ప్రశంస తనను కదిలించిందని రాజమౌళి తెలిపారు.

తమిళంలో పలు అద్భుతమైన సినిమాలకు తనదైన పాటలు రాసి ఐదు నేషనల్ అవార్డులతో పాటు, పద్మభూషణ్‌ను కూడా సొంతం చేసుకున్న వైరముత్తు, రాజమౌళిని ప్రశంసిస్తూ ఓ లేఖ పంపారు. కొద్దిసేపటి క్రితం రాజమౌళి ఆ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, తనకు గత నెలరోజులుగా ఎన్నో ప్రశంసలు దక్కగా, వైరముత్తు పంపిన ఈ ప్రశంస కదిలించి వేసిందని ఆయన తెలిపారు.

తాను పంపిన లేఖలో వైరముత్తు రాజమౌళిని ప్రశంసిస్తూ.. “రాజమౌళిలోనూ ఓ గొప్ప కవి ఉన్నాడు. బాహుబలి.. సెల్యూలాయిడ్‌పై రాసిన ఓ కవిత్వం. కదిలే బొమ్మలతో తయారైన ఉత్సవం” అంటూ మొదలుపెట్టి వైరముత్తు రాజమౌళిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఇక దర్శకుడుగా రాజమౌళి తనను ఏయే అంశాల్లో మంత్ర ముగ్ధుణ్ణి చేశాడో ప్రస్తావిస్తూ వైరముత్తు ఈ లేఖను పూర్తి చేశారు. ఇక చివరగా, రాబోయే కాలానికి రాజమౌళి ఇండియన్ సినిమాకు అడ్రస్‌గా నిలుస్తారని తెలపడం ఈ లేఖలో గొప్ప విషయం. ఇదిలా ఉంటే.. తనను కదిలించిన ఈ ప్రశంసను తీసుకోవడానికి ధైర్యం చాలడం లేదని, ఒక గురువు శిష్యుడికిచ్చిన ఆశీస్సులుగా మాత్రమే ఈ ప్రశంసను చూస్తానంటూ రాజమౌళి స్పందించడం విశేషం!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు