
సెకండ్ ఇండిపెండెన్స్ టాకీస్ పతాకంపై ప్రభాకర్ రెడ్డి నిర్మించిన సినిమా ‘కంట్రోల్ సీ’. అశోక్, దిశా పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు చల్లా సాయిరామ్ దర్శకుడు. ఓ సరికొత్త కథతో తెలుగు సినిమాలో ఇప్పటివరకూ రానటువంటి ఓ సరికొత్త జానర్లో ‘కంట్రోల్ సీ’ రూపొందినట్లు దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఇక ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఆడియో ఆవిష్కరణ సందర్భంగా కీరవాణి ‘కంట్రోల్ సీ’ ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. తదనంతరం మాట్లాడుతూ.. సినిమా మంచి విజయం సాధించాలని కాంక్షించారు. థ్రిల్లర్ జానర్లో ఓ సరికొత్త అంశం చుట్టూ నడిచే ఈ సినిమా కథ అందరికీ నచ్చేలా ఉంటుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో పృధ్వీ, బెనర్జీ, సమీర్, హేమ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. చంద్రమౌళి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు.

