
‘కంచె’.. గత కొద్దిరోజులుగా తెలుగులో అంతటా క్రేజీగా మారిపోయిన సినిమా. మెగా ఫ్యామిలీ నుంచి రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ రెండో సినిమాగా రూపొందిన కంచెపై ఇప్పటికే సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యానికి, ఒక ప్రేమకథకు ముడిపెట్టి విలక్షణ దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులు ఒక సరికొత్త అనుభూతికి లోనవుతారని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది. ఈమధ్యే విడుదలైన ట్రైలర్‌తో సినిమా ఏ రేంజ్లో ఉండనుందనే విషయంలో స్పష్టత వచ్చింది.
ఇక చిరంతన్ భట్ అందించిన మ్యూజిక్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అక్టోబర్ 2న పెద్ద ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ఇప్పటికే చివరిదశకు చేరుకున్నాయి. వరుణ్ తేజ్ నిన్ననే తన పార్ట్‌కు డబ్బింగ్ పూర్తి చేశారు. తనదైన మార్క్ సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న క్రిష్, ఈ సినిమా ద్వారా అందరినీ ఆశ్చర్యపరచే కథతో రానున్నారని తెలుస్తోంది. వరుణ్ తేజ్ సరసన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించారు.

